భార్య వేధింపులు తాళలేక ఎస్సై ఆత్మహత్య!
భార్య వేధింపులు తాళలేక ఎస్సై ఆత్మహత్య చేసుకున్నాడు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తన కన్నతల్లిని భార్య నిత్యం వేధించడంతో పాటు ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయేలా చేయడాన్ని ఆ ఎస్సై తట్టుకోలేకపోయాడు. తల్లి కోసం గాలించి అలసిపోయిన ఆ యువ అధికారి.. తీవ్ర మనస్తాపంతో తన సర్వీస్ రివాల్వర్‌తోనే ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన మధురలో అత్యంత హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. పోలీస్ శాఖలో సబ్-ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న 31 ఏళ్ల యాదవ్, తన భార్య దీప్తితో కలిసి నివాసముంటున్నారు. దీప్తి కూడా పోలీస్ శాఖలోనే కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. అయితే వీరి కాపురంలో అన్యోన్యత కరువైంది. ఎస్సై యాదవ్ తల్లికి, ఆయన భార్య దీప్తికి మధ్య గత కొంతకాలంగా ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. కోడలి వేధింపులు భరించలేక ఆ వృద్ధ తల్లి ఒకరోజు ఇల్లు విడిచి వెళ్లిపోయింది.
ఈ క్రమంలోనే గురువారం కూడా ఇంట్లో భార్యకు, తల్లికి తీవ్ర వాగ్వాదం, గొడవ జరగడంతో మనస్తాపం చెందిన ఎస్సై యాదవ్ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత తిరిగి ఇంటికి వచ్చి చూడగా తల్లి కనిపించలేదు. ఎక్కడికి వెళ్లిందని భార్య దీప్తిని నిలదీయగా.. ఆమె అత్యంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పింది. తల్లి ఆచూకీ తెలియకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన ఎస్సై యాదవ్.. ఆమెను వెతుకుంటూ మధురలోని గోకుల్ బ్యారేజ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ తల్లి ఆచూకీ లభించలేదు.
కన్నతల్లి జాడ తెలియక, భార్య ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన ఆయన ఆత్మహత్యే శరణ్యమని భావించారు. గోకుల్ బ్యారేజ్ పక్కనే తన సర్వీస్ రివాల్వర్‌తో కణతపై కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. తుపాకీ పేలుడు శబ్దం అనంతరం అక్కడ విగతజీవిగా పడి ఉన్న ఎస్సైని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న మధుర పోలీసులు.. మృతదేహం పక్కనే పడి ఉన్న సర్వీస్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిని వేధించిన వైనంపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.