బ్యాంకుల సమ్మె వాయిదా… నేటి నుంచి సేవలు యథాతథం
Bank Strike Postponed: బ్యాంకింగ్ ఉద్యోగుల మూడు రోజుల సమ్మె వాయిదా పడింది. సమ్మె చివరి నిమిషంలో వాయిదా పడింది. సోమవారం, మంగళ , బుధవారాల్లో జరగాల్సిన సమ్మెను వాయిదా వేస్తున్నట్టు యునైటెడ్ ఫొరమ్స్ ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆదివారం రాత్రి ప్రకటించింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య ఆదివారం రాత్రి జరిగిన చర్చలు సఫలం అయ్యాయి. దీంతో సోమవారం నుంచి దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. బ్యాంక్ ఎంప్లాయిస్ శనివారం సెలవుపై UFBU – ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) కలిసి ఉన్నతస్ధాయి కమిటి ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నాయి. ఆ కమిటి నిర్ణయం తరువాత సమ్మెపై తదుపరి కార్యాచరణ ఉంటుందని బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్స్ స్పష్టంచేశాయి. దాంతో సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజులపాటు జరగాల్సిన బ్యాంకు ఉద్యోగుల సమ్మె వాయిదా వేసుకోవడంతో సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి.
ఆదివారం రాత్రి ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో బ్యాంక్ యూనియన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ చర్చల అనంతరం ఇరువర్గాలు కొన్ని కీలక నిర్ణయాలకు అంగీకరించాయి. అన్ని శనివారాలను బ్యాంక్ సెలవులుగా ప్రకటించే (5 రోజుల వర్కింగ్) అంశాన్ని పరిశీలించేందుకు IBA, UFBU లతో కూడిన ఒక సంయుక్త కమిటీని తక్షణమే ఏర్పాటుకు అంగీకరించాయి. ఈ కమిటీ అన్ని అవకాశాలను అధ్యయనం చేసి, భాగస్వాములందరితో మాట్లాడి.. ఖాతాదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. స్కేల్-4, ఆపై స్థాయి అధికారుల పనితీరు ఆధారిత ఇన్సెంటివ్ (PLI) పథకంలో మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడానికి ఐబీఏ అంగీకరించింది. మార్చి 8, 2024న పేర్కొన్న ఇతర పెండింగ్ సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరించడంపై చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలు ఫలించడంతో తాత్కాలికంగా తమ నిరసనలు, సమ్మెను విరమిస్తున్నట్లు UFBU ఆదివారం రాత్రి ప్రకటించింది.
అన్ని బ్యాంకుల్లో వారానికి 5 రోజుల వర్కింగ్ డేస్ అమలు చేయడంతో పాటు సీనియర్ అధికారుల నూతన ప్రోత్సాహక పథకంలో (ఇన్సెంటివ్ స్కీమ్) మార్పులు చేయాలన్న డిమాండ్లపై బ్యాంక్ యూనియన్లు అతిపెద్ద సమ్మెకు వెళ్లాలని భావించాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న ఫైవ్ డే బ్యాంకింగ్‌ను సాధించుకోవడానికి బ్యాంక్ ఉద్యోగులు సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఐబీఏతో జరిగిన చర్చల్లో కమిటీ ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని చెప్పడంతో బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధులు ప్రస్తుతానికి శాంతించారు.