‘దళిత బంధు’ నిధులు విడుదల
తెలంగాణలో దళిత బంధు పథకం కింద ప్రభుత్వం మంగళవారం నిధులు విడుదల చేసింది. ఎంపిక చేసిన నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు దళిత బంధు కింద ఎస్సీ కార్పొరేషన్ నిధులను కేటాయించింది. ఈ నిధులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. నాలుగు మండలాలకు కలిపి మొత్తం రూ. 250 కోట్లను జమ చేసినట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలంలో దళిత బంధును సంతృప్త స్థాయిలో అమలు చేసేందుకు రూ. 50 కోట్లు.. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలంలో దళిత బంధు అమలు కోసం రూ.100 కోట్లు… నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలంలో దళిత బంధు అమలు కోసం రూ. 50 కోట్లు… కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలంలో దళిత బంధు అమలు కోసం రూ. 50 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.