సారూ.. కదలాలి మీరూ..
-గుట్టుగా సాగుతున్న దందా
-ఏటా క్వింటాళ్ళ కొద్ది పట్టుబడుతున్న వైనం
-అవగాహన లేక నష్టపోతున్న రైతులు
-ఇప్పటికే పల్లెలకు చేర్చిన ఆంధ్రా ప్రాంత వ్యాపారులు
-ముందుగానే కట్టడి చేస్తే ఫలితం ఉంటుందన్న రైతులు
మంచిర్యాల : పరల తి ఏటా నకిలీ పత్తి విత్తనాలు కొంపముంచుతున్నాయి. ప్రతీ ఏటా మరోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు, వ్యవసాయ అధికా రులు దాడులు చేసి పట్టుకుంటున్నప్పటికి గ్లైసిల్ విత్త నాలు పల్లెలకు చేరుతూనే ఉన్నాయి. అయితే ప్రతీ ఏటా అధికారులు సీజన్ ప్రారంభంలో చేస్తుంటారు. దీనిని గమనించిన నకిలీ విత్తన వ్యాపారులు తెలివిగా ముందుగానే చేరవేస్తున్నారు. ఇప్పటికే పల్లెలకు ఈ విత్తనాలు చేరుకున్నాయి. ఇప్పుడే వీటిపై దృష్టి పెడితే ఫలితం ఉంటుందని పలువురు చెబుతున్నారు.
వ్యాపారుల మాయాజాలం, అధికారుల ఉదాసీనత కలిసి అన్నదాతకు నకిలీ విత్తన కష్టాలు తప్పడం లేదు. తొలకరి పలకరించగానే పొలానికి పరుగులు పెట్టే రైతన్నకు చేతిలో ఉన్నది కాపు రాని విత్తన ప్యాకెట్ అని ఐదు నెలలు గడిస్తే గానీ తెలియని దుస్థితి. సంతోషంగా సాగుకు వెళ్తున్న రైతులను నకిలీ విత్తనాలు వెక్కిరిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే నకిలీ విత్తన దందాతో ఏటా వందల కోట్ల నష్టాన్ని రైతాంగం మూటగట్టుకుంటోంది. రైతులు దొరకవేమోనని ఆగమాగంగా విత్తన కొనుగోళ్లు జరిపాక, ఎలాగోలా విషయం లీకైనప్పుడు మాత్రమే యంత్రాంగం రంగంలోకి దిగుతుంది తప్పా.. దాడులే చేయడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. అటు బ్లాక్ దందా ముఠాల ఆగడాలు, ఇటు అధికారుల నిర్లక్ష్యాలు రైతును బలి దీసుకుంటున్నాయి.
నిత్యం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నకిలీ విత్తనాలు పట్టుబడుతూనే ఉన్నాయి. టాస్క్ ఫోర్స్ టీమ్స్ పట్టణాల్లో, మండల కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తూ కోట్ల రూపాయల విలువైన విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకుంటున్నాయి. సీజన్ ప్రారంభానికి ముందే నిఘాను కట్టుదిట్టం చేస్తే నకిలీ రాయుళ్ల ఆటలకు కట్టలు వేయొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత పెద్ద దందాపై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన యంత్రాంగం, ఎవరైనా ఉప్పందిస్తేనే దాడులు చేస్తున్నారు తప్ప నిత్యం ముఠాల కదలికలపై కన్నేసి ఉంచాల్సిన సంబంధిత శాఖాధికారులు కళ్లు మూసుకున్నట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఏటా సుమారు యాభై వేల ఎకరాల్లో నకిలీ విత్తనాలు వేసి రైతులు నష్టపోతున్నారంటే చీకటి దందా ఎంతగా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.
కొందరు అధికారుల కనుసన్నల్లోనే నకిలీ విత్తనాల దందా జోరుగా సాగుతోందనే అపవాదు కూడా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి, మాదారం, నెన్నల, భీమిని, తిర్యాణి, సిర్పూర్, ఆసిఫాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో నకిలీ విత్తనాలు జోరుగా రాజ్యమేలుతున్నాయి. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఇక్కడ పాగా వేసి విత్తనాల వ్యవహారం నడిపిస్తున్నారు. వీరికి స్థానికులు కొందరు సహకరిస్తుండటంతో వారి పని సజావుగా సాగుతోంది. మరికొందరు ఇక్కడ తెలివిగా భూములు కౌలుకు తీసుకుని మరీ చుట్టు పక్కల రైతులు ఈ విత్తనాలు అంటగడుతున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలల్లో నకిలీ విత్తనాల డంప్ పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఆ సమయంలో యంత్రాంగం మొక్కుబడిగా హెచ్చరిస్తున్నట్టు ప్రకటనలు ఇస్తూ, పకడ్బందీగా నిఘా పెట్టామని చెబుతూ సమయాన్ని వృథా చేస్తోంది. మరో వైపు అటు ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో రైతులు, సంబంధిత శాఖాధికారులు కూడా తలమునకలై బిజీగా మారుతారు. వీటన్నింటినీ అవకాశంగా తీసుకుని నకిలీ దందా చేసే ముఠాలు తమ వ్యవహారాన్ని చక్క బెట్టుకుంటున్నాయి. గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ర్టాల నుంచి టన్నుల కొద్ది విత్తన ప్యాకెట్లు రాష్ట్రనికి డంప్ అవుతున్నాయి. వాటన్నింటినీ జిల్లా కేంద్రాలకు తరలిస్తూ సీజన్ ప్రారంభం నాటికి అమ్మకాలు జరుపుతున్నారు.
అయితే, కేటుగాళ్లు తమ రూటు మార్చారు. వారు పత్తి విత్తనాల అమ్మకాలు ఇప్పటి నుంచే మొదలు పెట్టారు. వ్యవసాయ సీజన్ ప్రారంభంలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారుల నిఘా ఉంటుందని ముందుగానే అమ్మకాలు సాగిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల డంప్‌లు తీసుకువచ్చి పెట్టినట్లు తెలుస్తోంది. గత ఏడాది సైతం దాదాపు 60 శాతం మేర గైసిల్ విత్తనాలే సాగు చేశారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇలా సాగు చేసిన రైతులు పూర్తి స్థాయిలో నష్టపోయారు. గడ్డి మొలవదనే ఉద్దేశంతో రైతులు వీటిపైపు మొగ్గు చూపుతున్నారు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని ఈ విత్తనాలు అమ్ముతున్నారు. గ్లైసిల్ విత్తనాలతో పర్యవరణానికి ముప్పుతో పాటు నేల నిస్సారమవుతుందనే విషయం పై చైతన్యం చేయడం లేదు. దీంతో నాలుగేళ్లుగా నకిలీ విత్తనాల సమస్య పెరిగిపోతూనే ఉంది. ఈ సంవత్సరం కూడా ఆవే విత్తులతో సాగు చేయాలనే ఆలోచనతో దళారులను ఆశ్రయిస్తున్నారు. కలుపు కష్టం లేకుండా దిగుబడి కోసం గ్లైసిల్ విత్తనాలపై ఆధారపడటం ఎక్కువ అయ్యే సరికి విత్తన మోసాలు పెరిగిపోయాయి. రైతుల అవసరాన్ని సొమ్ము చేసుకుని వ్యాపారులు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు.
పోలీసుల వద్ద నిత్యం విత్తనాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్న వారి జాబితా ఉంది. అదే సమయంలో కొందరు కొత్తగా ఈ విత్తనాలు కొనుగోలు చేసుకుని వచ్చి నిల్వ చేస్తున్నారు. గ్రామాల్లో వారిపై ఇప్పటి నుంచే నిఘా పెట్టాలని పలువురు కోరుతున్నారు. వ్యవసాయ, పోలీసులు సమష్టిగా వారిపై దృష్టి పెడితే తప్ప ఈ నకిలీల వ్యవహారం ఆటకట్టదని రైతులు చెబుతున్నారు. అదే సమయంలో ఈ రెండు శాఖల ఆధ్వర్యంలో గ్లైసిల్ విత్తనాలపై రైతుల్లో అవగాహన కల్పించాలని కోరుతున్నారు.