నేడు బండి సంజయ్ మౌనదీక్ష
రాజ్యాంగాన్ని మార్చాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా నేడు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టబోతున్నాయి. ఇందులో భాగంగా రేపు ఢిల్లీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ మౌన దీక్ష చేపట్టనున్నారు. ఈ దీక్షలో బీజేపీ ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాబూరావు, కేంద్ర జలవనరులశాఖ సలహాదారు వెదిరె శ్రీరామ్, పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి కామర్సు బాలసుబ్రమణ్యం పాల్గొననున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు.
కాగా రాజ్యాంగాన్ని తిరిగి రాయాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం గురించి ఇటువంటి వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగొద్దనేలా ఉన్నాయని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ వ్యాఖ్యలతో బడుగు బలహీనవర్గాలపై కేసీఆర్కు ఉన్న ద్వేషం బయటపడిందన్నారు. అందుకే సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకారని బండి సంజయ్ ఆరోపించారు.