ఆ సంక్షోభం సింగరేణిపై పడకుండా చూడండి

మంచిర్యాల : దేశంలో పేలుడు ప‌దార్థాల కొరత తలెత్తుతున్న నేపథ్యంలో దాని ప్రభావం సింగరేణిపై పడకుండా చూసేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలకు సిద్ధమైంది. డైరెక్టర్లు ఎస్‌.చంద్రశేఖర్‌ (ఆపరేషన్స్‌), ఎన్‌.బలరామ్‌ (ఫైనాన్స్‌, పర్సనల్‌, పి అండ్‌ పి) శుక్రవారం కొత్తగూడెం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఎక్స్‌ ప్లోజివ్స్‌ తయారీదారులు, సరఫరాదారులతో మాట్లాడారు. ఉత్పత్తికి అతి కీలకమైన చివరి రెండు నెలల్లో పేలుడు ప‌దార్థాల‌ కొరత రాకుండా చూడాలని కోరారు. సింగరేణి కాలరీస్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 68 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి వీలుగా రోజుకు 15 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ ను తొలగించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం ప్రతి రోజు 500 టన్నులకు తగ్గకుండా ఎక్స్‌ ప్లోజివ్స్‌ను సరఫరా చేయాలని డైరెక్టర్లు ఆదేశించారు. వీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి సహాయ సహకారాలు అందించాలన్నారు.

ఈ నెల 1 నుంచి 10 వరకు రోజుకు సగటున కేవలం 385 టన్నుల మేరకు మాత్రమే పేలుడు ప‌దార్థాల సరఫరా జరిగిందన్నారు. దీని వల్ల ఓవర్‌ బర్డెన్‌ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాని వారు స్ప‌ష్టం చేశారు. ఇండెంట్‌ లో 73 శాతం మేరకు సరఫరా జరుగుతోందని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని 100 శాతానికి పెంచాలన్నారు.

దేశీయ, అంతర్జాతీయ మార్కెటులో అమ్మోనియం నైట్రేట్‌ ధర పెరగడం వలన ఎక్స్‌ ప్లోజివ్స్‌ తయారీపై కొంత ప్రభావం ఉన్నప్పటికీ సింగరేణికి మాత్రం నిర్దేశిత పరిమాణంలో ఎక్స్‌ ప్లోజీవ్స్‌ సరఫరా జరిగేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవల్సిందిగా తయారీదారులను కోరారు. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు నిరాటంకంగా బొగ్గు సరఫరా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో ఎక్స్‌ ప్లోజివ్స్‌ తయారీ దారులు కూడా పూర్తి సహకారం అందించాలన్నారు. జీఎం (కో ఆర్డినేషన్‌) కె.సూర్యనారాయణ అవసరాల మేరకు కావాల్సిన ఎక్స్‌ ప్లోజివ్స్‌ వివరాలను సంబంధిత జనరల్‌ మేనేజర్లను అడిగి తెలుసుకున్నారు. డిమాండ్‌ కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయడానికి జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఒప్పందం మేరకు సరఫరా చేయని కంపెనీలపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

పేలుడు ప‌దార్థాలు సమర్థంగా వినియోగిస్తూ బ్లాస్టింగ్‌ లను పకడ్బందీగా చేయాలని కోరారు. పౌడర్‌ ఫ్యాక్టర్‌ మెరుగుపడేలా చూడాలని అన్ని ఏరియాల జీఎంలకు సూచించారు. ఎక్స్‌ ప్లోజివ్స్‌ తయారీ, సరఫరా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ ఎక్స్‌ ప్లోజివ్స్‌ తయారీకి అవసరమైన ముడిసరుకులను సరఫరా చేసే రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ (ఆర్‌ సి ఎఫ్‌), దీపక్‌ ఫర్టిలైజర్స్‌ నుంచి సరఫరా విషయంలో తమకు కొన్ని సమస్యలు ఉన్నా సాధ్యమైనంత వరకు వాటిని సరఫరా చేస్తామన్నారు. సమావేశంలో అడ్వయిజర్‌ (మైనింగ్‌) డి.ఎన్‌.ప్రసాద్‌, జీఎం (మార్కెటింగ్‌) కె.రవిశంకర్‌, జీఎం (స్ట్రాటెజిక్‌ ప్లానింగ్‌) జి.సురేందర్‌, కొత్తగూడెం నుంచి జీఎం (సీపీపీ) కె.నాగభూషణ్‌ రెడ్డి, ఎస్వోటూ డైరెక్టర్లు దేవీ కుమార్‌, రవి ప్రసాద్‌, జీఎం(ఫైనాన్స్‌) సుబ్బారావు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like