సీఎంపీఎఫ్ కాంట్రిబ్యూషన్ 61 ఏళ్ల వరకు ఇవ్వండి
-కార్మికులకు లబ్ధి చేకూరేలా నిర్ణయం తీసుకోండి
-సీఎంపీఎఫ్ కమిషనర్ సమిరాన్ దత్తా కు డైరెక్టర్ ఎన్.బలరామ్ విజ్ఞప్తి
-బోర్డు ఆఫ్ ట్రస్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న కమిషనర్
సింగరేణి ఉద్యోగులందరికీ సీఎంపీఎఫ్ పింఛన్, కాంట్రిబ్యూషన్ చెల్లింపునకు 61 ఏళ్లను ప్రాతిపదికగా తీసుకోవాలని డైరెక్టర్ (పర్సనల్,ఫైనాన్స్,పిఅండ్ పి) ఎన్.బలరామ్ కోరారు. సింగరేణి బొగ్గు గనుల్లో నూతన సాంకేతికత వినియోగం, గనుల్లో సేఫ్టీ ప్రమాణాల పెంపు, ఉద్యోగుల సీఎంపీఎఫ్ తదితర అంశాలపై చర్చించేందుకు డైరెక్టర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ, ధన్ బాద్ లో రెండు రోజులుగా పర్యటిస్తోంది. పర్యటనలో భాగంగా సీఎంపీడీఐ ఉన్నతాధికారులను, డీజీఎంఎస్, సీఎంపీఎఫ్ కమిషనర్ లతో ప్రత్యేకంగా భేటీ అయి పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
సీఎంపీఎఫ్ బోర్డు ఆఫ్ ట్రస్టీల భేటీలో నిర్ణయం…
పదవీ విరమణ వయసు పెంపు నేపథ్యంలో ఉద్యోగుల సీఎంపీఎఫ్ సెటిల్మెంట్ అంశంపై జీఎం(పర్సనల్), ఐఆర్, పీఎం ఎ.ఆనందరావు, జీఎం (ఫైనాన్స్) ఎం.సుబ్బారావు తదితరులతో కలిసి డైరెక్టర్ ఎన్.బలరామ్ శుక్రవారం ధన్ బాద్ లోని సీఎంపీఎఫ్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ సమిరాన్ దత్తా తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ఎన్.బలరామ్ మాట్లాడుతూ.. ప్రాంతీయ సీఎంపీఎఫ్ కమిషనర్లు పింఛన్ , కాంట్రిబ్యూషన్ సెటిల్మెంట్ విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. వేల మంది కార్మికుల ప్రయోజనాలను దృష్టి లో ఉంచుకొని సీఎంపీఎఫ్ విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. దీనిపై కమిషనర్ దత్తా సానుకూలంగా స్పందిస్తూ.. పదవీ విరమణ పెంపు అంశం తమ దృష్టి లో ఉందని, అయితే బోర్డు ఆఫ్ ట్రస్టీల సమావేశంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు.
అక్కడే ఉన్న బీసీసీఎల్ డైరెక్టర్(పర్సనల్) మల్లికార్జునరావు మాట్లాడుతూ.. సింగరేణి కాలరీస్ లో రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా, కేంద్రానికి 49 శాతం వాటా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పదవీ విరమణ వయసు పెంపునకు నిర్ణయం తీసుకున్న విషయాన్ని కమిషనర్ కు వివరించారు. దీనిపై త్వరగా నిర్ణయం తీసుకోవడం ద్వారా కార్మికులకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. విషయం తీవ్రతను అర్థం చేసుకున్నామని, కచ్చితమైన నిర్ణయాన్ని ట్రస్టీల సమావేశంలో తీసుకుంటామని కమిషనర్ దత్తా పునరుద్ఘాటించారు.
ఓబీ వెలికితీతకు డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై అధ్యయనం..
కేంద్ర మైనింగ్ ప్లానింగ్, డిజైన్ సంస్థ(సీఎంపీడీఐ) ఉన్నతాధికారులతో జీఎం (ప్రాజెక్టు ప్లానింగ్) పి.సత్తయ్య తదితరులతో కలిసి డైరెక్టర్ బలరామ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం సింగరేణి కి చెందిన నాలుగు సీహెచ్ పీల డిజైన్ల ప్రాజెక్టును, ఎక్స్ ప్లోజివ్స్ నాణ్యతలను సీఎంపీడీఐ పరిశీలిస్తోందన్నారు. మరో సీహెచ్ పీ ప్రాజెక్టు బాధ్యతలను అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. రెండు సంస్థలు కూడా బొగ్గు ఉత్పత్తి, రవాణా తదితర అంశాలతో ముడిపడిన విషయాల్లో పరస్పర సహకారంతో ముందుకెళ్తున్నాయన్నారు.
గనుల్లో ఓబీ వెలికితీత పరిమాణాన్ని అంచనా వేసే డ్రోన్ టెక్నాలజీ ప్రాజెక్టును సీఎంపీడీఐ చేపడుతోందన్నారు. ఇదే తరహా ప్రాజెక్టును సింగరేణి లోనూ చేపట్టడానికి గల సాధ్యాసాధ్యాలపైనా చర్చించారు. గతంలో ఉన్న టెక్నాలజీతో పోల్చితే డ్రోన్ టెక్నాలజీ తో మరింత వేగంగా, కచ్చితమైన సమాచారాన్ని పొందడం వీలవుతుందని సీఎంపీడీఐ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను, సింగరేణి లో చేపట్టే అంశంపైనా చర్చించారు. సమావేశంలో సీఎంపీడీఐ డైరెక్టర్లు శ్రీ ఆర్.ఎన్.ఝా, ఎ.కె.ఝా, ఎస్.కె.గోమస్తా, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ సుమిత్ కుమార్ సిన్హా, జీఎంలు పాల్గొన్నారు.
డీజీఎంఎస్ తో భేటీ..
ఈ సందర్భంగా డీజీఎంఎస్ ప్రభాత్ కుమార్ తో డైరెక్టర్ ఎన్.బలరామ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అంతర్జాతీయంగా గనుల్లో నాణ్యతను పెంచేందుకు వచ్చిన నూతన సాంకేతికతలపై చర్చించారు. సింగరేణిలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రమాదాల నివారణకు కృషి చేస్తున్న విషయాన్ని డైరెక్టర్ డీజీఎంఎస్ కు వివరించారు.