సింగరేణి ప్రైవేటీకరణపై దమ్ముంటే చర్చకు రండి
-కేంద్రం పాత్ర ఉందని కుట్రపూరిత ప్రచారం
-అసలు ప్రైవేటీకరణ కుట్ర చేస్తోందే కేసీఆర్
-బీఎంఎస్ మహాసభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్
గోదావరిఖని : సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణలో కేంద్రం పాత్ర ఉందని కుట్ర పూరిత ప్రచారం జరుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జిఎం కాలనీ మైదానంలో జరిగిన సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘం (బిఎంఎస్) 27వ ద్వై వార్షిక మహాసభలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటు పరం చేస్తుందనే ప్రచారం అబద్దమన్నారు. ఈ ఆంశంపై అసెంబ్లీలో నైనా, రామగుండంలోనైనా చర్చకు నేను సిద్దంగా ఉన్నానని, దమ్ముంటే చర్చకు రావాలని కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి కేంద్రంపై కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసేందుకు కేసీఆర్ పన్నాగాలు పన్నుతున్నారన్నారు. దానిని దృష్టి మళ్లించేందుకు కేంద్రంపై బురద చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు బావుల మీద వేల కోట్ల రూపాయలు గోల్ మాల్ జరిగిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్, దాని అనుబంధ సంస్థలు పతనం అంచున ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రగతి భవన్ లో కూర్చొని సీఎం కేసీఆర్ ముఖం చాటేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే బాధ్యత తమపై ఉందన్నారు. కార్యక్రమంలో బిఎంఎస్ జాతీయ నాయకులు కొత్తకాపు లక్ష్మారెడ్డి, అశోక్ మిశ్రా, మాధవ నాయక్, తూర్పు రాం రెడ్డి, మల్లోజుల కిషన్, యాదగిరి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.