ఆర్టీసీ డిపో ఎత్తివేస్తే ఉద్యమమే
-మినీ బస్సులు యాదాద్రికి తరలించే కుట్ర
-కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెడమ బొజ్జు
ఉట్నూరు ఆర్టీసీ డిపో ఎత్తివేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వెడమ బొజ్జు స్పష్టం చేశారు. ఉట్నూరు డిపో ఎత్తివేత ప్రతిపాదన విరమించుకోవాలని అఖిలపక్షం నేతలు బుధవారం ఆందోళన నిర్వహించారు. ఉదయం ఆరు గంటల నుంచి ఈ ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా బొజ్జు మాట్లాడుతూ ఏజెన్సీ, గిరిజన ప్రాంతంలో రవాణా సౌకర్యాలు మెరుగయ్యేందుకు గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉట్నూరులో ఆర్టీసీ డిపో నెలకొల్పిందన్నారు. ఇక్కడ ఇంకా సౌకర్యాలు కల్పించి, బస్సుల సంఖ్య పెంచాల్సింది పోయి దీనిని ఎత్తివేయాలని చూడటం దారుణమన్నారు. మినీ బస్సు లను యాదగిరి గుట్టకు తరలించాలని కుట్ర జరుగుతోందన్నారు. మినీ బస్సులను తరలించినా, డిపో ఎత్తివేసినా ఉద్యమం మాత్రం తప్పదని మరోమారు హెచ్చరించారు. గ్రామీణ పేదల సంఘం రాష్ట్ర కార్యదర్శి నేతావత్ రాందాస్ మాట్లాడుతూ డిపో ఎత్తివేసే ఆలోచనలు మానుకోకపోతే అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ఆందోళనలకు దిగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ నాయకులు బానోత్ రామారావు, గొల్లపల్లి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ ఉట్నూర్ మండల అధ్యక్షుడు సయ్యద్ ఎక్బాల్ కాంగ్రెస్ పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ జాదవ్ సునీల్, ఎస్టీ సెల్ జిల్లా నాయకులు రాహుల్, సలీం, ఖలీల్, జాదవ్ విలాస్, దేవానంద్, ప్రభాస్, జావిద్ తదితరులు పాల్గొన్నారు .