సింగరేణిపై ‘సమ్మె’ట
-ఈ నెల 28,29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె
-సింగరేణిలో బీఎంఎస్ సహా మిగతా కార్మిక సంఘాల మద్దతు
-పేలుడు పదార్థాల కొరతతో ఇప్పటికే ఉత్పత్తిలో మందగమనం
-రెండు రోజుల సమ్మెతో పెద్ద ఎత్తున విఘాతం
మంచిర్యాల : రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో సైతం సమ్మె చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. బీఎంఎస్ మినహా మిగతా కార్మిక సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి. ఇప్పటికే బొగ్గు ఉత్పత్తి లక్ష్యాల సాధనకు కసరత్తు చేస్తున్న సింగరేణికి ఓ వైపు అమ్మోనియా నైట్రేట్ కొరత వెంటాడుతుండగా ఈ సమ్మె ప్రభావం చూపే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా ఈ నెల 28, 29 తేదీల్లో కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపుని చ్చాయి. నాలుగు జాతీయ కార్మిక సంఘాలతో పాటు ప్రాంతీయ కార్మిక సంఘాలు కలిసి ఐక్యంగా సమ్మెను విజయవంతం చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ప్రధానంగా సింగరేణికి చెందిన నాలుగు బొగ్గుబ్లాకులను వేలం వేయడాన్ని కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలన్న డిమాండును ప్రధానంగా తీసుకున్న జాతీయ కార్మిక సంఘాలు మిగతా సంఘాల మద్దతు కూడగట్టాయి. జాయింట్ యాక్షన్ గా ఏర్పడి సింగరేణి వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాయి.
ఉత్పత్తిపై ప్రభావం..
సింగరేణి సంస్థ ఈ ఏడాది 68 మిలి యన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి కసరత్తు చేస్తున్న యాజమాన్యానికి పేలుడు పదార్థాల సరఫరా కొరత ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. యుద్ధం కారణంగా ఈ పేలుడు పదార్థాల సరఫరా సక్రమంగా జరడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 61 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించింది. ఇంకా 14 రోజులు మిగిలి ఉంది. మరో 7 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలంటే రోజుకు 4 లక్షల టన్నులకు పైనే బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. రోజుకు 2.5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సింగరేణి రెండు రోజులు అంటే 5 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడే అవకాశం ఉంది.
ఖచ్చితంగా సమ్మె చేయాల్సిందే..
ఈ సమ్మెకు కార్మిక సంఘాలకు ప్రధాన అస్త్రంగా మారనుంది. గత ఏడాది డిసెంబర్‌లోనే సమ్మెకు వెళ్లిన కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటారా..? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కానీ త్వరలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎవరూ వెనక్కి తగ్గేదిలేదంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే కార్మికులను సమాయత్తం చేసే పనిలో కార్మిక సంఘాలు నిమగ్నమయ్యాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భూపాలపల్లిలో సమావేశం ఏర్పాటు చేసి ఏరియా నేతలతో చర్చించి సమ్మెకు సై అంది. దీంతో సమ్మె రెండు రోజుల పాటు ఖచ్చితంగా జరిగితీరుతుందని అంతా భావిస్తున్నారు.
ఏం చేద్దాం..? యాజమాన్యం ఆలోచన
రానున్న సమ్మెను ఏవిధంగా అధిగమించాలన్న దానిపై సింగరేణి సమాలోచన చేస్తోంది. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను అధిగమించేందుకు కసరత్తు చేస్తోంది. గతంలో జరిగిన సమ్మె సందర్భంగా యాజమాన్యం ఏ మాత్రం నోరు మెదపలేదు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ముందుండి నడిపించిన సమ్మె విజయవంతం కావడంలో పరోక్షంగా సహకరించింది. ఇప్పుడు సమ్మె వద్దని చెబితే ఇంటి సంఘం కాబట్టి ఆ సమ్మె గురించి మాట్లడకుండా, ఇప్పుడు మాట్లాడం ఏమిటని మిగతా కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. కాబట్టి ఏం చేయాలనే దానిపై యాజమాన్యం మల్లగుల్లాలు పడుతోంది.