ఇక బంగారం ఏటీఎంలు

ఏటీఎంల‌లో ఇప్ప‌టి వ‌ర‌కు డ‌బ్బులు మాత్ర‌మే తీసుకుంటున్నాం… రాబోయే రోజుల్లో ఇక బంగారం కూడా తీసుకునే అవ‌కావం రానుంది. దేశంలోనే తొలిసారిగా గోల్డ్‌సిక్కా బంగారు ఏటీఎంలను ఏర్పాటు చేస్తోంది. ఇవి కూడా ఏటీఎం యంత్రాల్లానే ఉంటాయి. కార్డుతోనే అక్కడ బంగారం కొనుగోలు చేయవచ్చు. డబ్బులు చెల్లించిన వెంటనే మీ చేతికి బంగారం వ‌స్తుంది. వచ్చే ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 3,000 ఏటీఎంలను ఏర్పాటు చేసేందుకు గోల్డ్‌సిక్కా ఏర్పాటు చేస్తోంది. ఇందులో 60-70 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే నెలకొల్పనున్నారు. ముందుగా హైదరాబాద్‌లో ప్రయోగాత్మకంగా ఈ ఏటీఎంలను ప్రారంభించనున్నారు.

హైదరాబాద్‌లో మరో నెలన్నర రోజుల్లోనే వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. బంగారం వ్యాపారులు అధికంగా ఉండే పాతబస్తీ, ఆబిడ్స్‌ సహా హైదరాబాద్‌లో మూడు చోట్ల ప్రయోగాత్మకంగా మూడు ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నట్లు గోల్డ్ సిక్కా సీఈవో తరుజ్‌ తెలిపారు. హాల్‌మార్కింగ్‌, ఇతర గుర్తింపు ధృవీకరణలు కలిగి ఉన్న 0.5 గ్రాముల నుంచి 10 గ్రాముల వరకూ కాయిన్లను, 100 గ్రాముల వరకూ బార్లను ఏటీఎంలలో ఉంచుతారు. ఒక్కో ఏటీఎంలో గరిష్టంగా 5 కేజీల వరకూ బంగారం ఉంటుంది.

గోల్డ్‌సిక్కా విక్రయించే కార్డులను కొనుగోలు చేసి ఏటీఎంల నుంచి మీకు కావాల్సినంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు. డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డుల ద్వారా కూడా బంగారాన్ని కొనుగోలు చేసేందుకు బ్యాంకులతో గోల్డ్ సిక్కా సంప్రదింపులు జరుపుతోంది. షోరూమ్‌లతో పోలిస్తే ఏటీఎంలలోనే తక్కువ ధరకు బంగారం కొనుగోలు చేసేలా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేశారు. లైవ్‌ రేట్లకు అనుగుణంగా ఏటీఎంలో పసిడి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి.

గోల్డ్ ఏటీఎంలకు టెక్నాలజీ అందించేందుకు… ఆర్థికరంగంలో సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ని అందిస్తున్న ట్రూనిక్స్‌ డేటావేర్‌, కేఎల్‌ హై-టెక్‌ సెక్యూర్‌ ప్రింట్‌ వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు గోల్డ్‌సిక్కా తరుజ్‌ పేర్కొన్నారు. బంగారాన్ని మరింత పెట్టుబడి సాధనంగా తీర్చిదిద్దడం, షోరూమ్‌ల్లో కొనుగోలు చేయడం వల్ల పడే అదనపు భారాన్ని తగ్గించడం, సాధారణ కొనుగోలుదారులు చిన్నచిన్న మొత్తాల్లో పసిడిని కొనుగోలు చేయడానికి వెలుసుబాటు కల్పించడం వంటి లక్ష్యాలతో గోల్డ్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నామని గోల్డ్ సిక్కా పేర్కొంది.

ప్రస్తుతం పలు అభివృద్ధి చెందిన దేశాల్లో గోల్డ్ డిస్పెన్సింగ్ మెషీన్లు ఉన్నాయి. యూఏఈలోని దుబాయ్, అబుదాబితో పాటు అమెరికాలో కూడా ఇలాంటి ఏటీఎంలు కనిపిస్తాయి. కానీ మన దేశంలో తొలిసారిగా ఈ యంత్రాలు రాబోతున్నాయి.

Get real time updates directly on you device, subscribe now.

You might also like