కేసీఆర్తో గ్యాప్ పై జీయర్ ఏమన్నారంటే..?
తమకు ఎవరితోనూ గ్యాప్ లేదని త్రిదండి చిన్నజీయర్ స్వామి స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో గ్యాప్ వచ్చిందా అని విలేకరులు ప్రశ్నించగా ఆయన సమాధానమిచ్చారు. తమకు ఎవరితోనూ గ్యాప్ లేదని అయితే అవతలివాళ్లు గ్యాప్ పెంచుకుంటే తామేమీ చేయలేమన్నారు. మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేస్తున్నామని అందుకే ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామన్నారు. అదే సమయంలో రాజకీయాల్లోకి వస్తారా అని ఓ విలేకరి ప్రశ్నించడంతో దానికి కూడా జీయర్ జవాబిచ్చారు. తమకు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తమ అవసరం ఎవరికైనా ఉంటే వారికి సహాయం చేస్తామని తాము పెద్ద గా ఎవరితో రాసుకుని పూసుకుని తిరగమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
సమ్మక్క-సారలమ్మల గురించి తాను మాట్లాడిన దానిపై స్పందిస్తూ 20 ఏళ్ల కిందట మాట్లాడిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి వారి సొంత లాభాల కోసం వివాదం చేస్తున్నారని ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలపై పూర్వాపరాలు తెలుసుకోకుండా కొందరు పనికట్టుకుని సమస్యగా మారుస్తున్నారన్నారు. గ్రామ దేవతల్ని అవమానించారనడం రికాదన్నారు. కులం, మతం అనే తేడా లేదని, అందరినీ గౌరవించాలనేదే మా విధానం అని తేల్చి చెప్పారు. ఈ మధ్య కాలంలో కొన్ని వివాదాలు తలెత్తాయని, మాపై వచ్చిన ఆరోపణలు, ఎలా వచ్చాయో వారి వివేకానికే వదిలేస్తున్నానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తమ వ్యాఖ్యలపై తాత్పర్యం తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తే.. వారిపై జాలిపడాల్సి వస్తుందన్నారు. యాదాద్రికి కూడా పిలిస్తే వెళ్తామని, లేదంటే చూసి ఆనందిస్తామని చెప్పుకొచ్చారు.