అధ్యయనం చేశాం.. అవగాహన కల్పిస్తాం..
-మహారాష్ట్ర పర్యటనలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం
-ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులతో చర్చిస్తాం
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్
మంచిర్యాల : తాము మూడు రోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించామని అందులో ఎన్నో విషయాలు తెలుసుకున్నామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పష్టం చేశారు. తెలంగాణలో పంట మార్పిడి ప్రత్యామ్నాయ పంటల సాగు, లాభదాయక సాగు విధానాల మీద అధ్యయనం చేయడానికి వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మూడు రోజులు పర్యటించారు. ఈ పర్యటనపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న రైతు సంక్షేమ కార్య్రమాలను స్థానిక రైతులకు వివరించామన్నారు. చెన్నూర్ లో ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పామ్ ఆయిల్ సాగు విధి విధానాలను స్థానిక రైతులతో పంచుకున్నట్లు చెప్పారు. వ్యవసాయంలో పంటల సాగు, నూతన విధి విధానాలపై అనేక విషయాలు తెలుసుకున్నట్లు బాల్క స్పష్టం చేశారు. తాము అధ్యయనం చేసిన అనేక విషయాలపై త్వరలోనే చెన్నూర్ రైతులతో సమావేశం ఏర్పాటు చేసి వారితో పంచుకుంటామని తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా తొలి రోజు అహ్మద్ నగర్ జిల్లా షిరిడి సమీపంలో వ్యవసాయ, ఉద్యాన ఆధారిత పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, డ్రిప్ ఇరిగేషన్ ల్యాబ్ లో డ్రిప్ ఇరిగేషన్ సిస్టం ద్వారా పండించిన మిరియాలు, జామ, ఆలు, అల్లం, టమాటా మరియు తదితర పంటల సాగును పరిశీలించారు.
రెండో రోజు పర్యటనలో భాగంగా జల్ గావ్ సమీపంలోని జైన్ హిల్స్ లో ఉద్యాన సాగు, ప్రపంచంలోనే అతి పెద్ద మామిడి ప్రాసెసింగ్ ప్లాంట్, టిష్యూ కల్చర్ మొక్కల తయారీ, మైక్రో ఇరిగేషన్, డ్రిప్, సోలార్ పంపుసెట్ల తయారీ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతులు,అధికారులతో పలు విషయాలపై కూలంకషంగా చర్చించారు.
మూడో రోజు ఆదివారం జల్ గావ్ జిల్లా, రావేర్ తాలూకాలోని పలు అరటి తోటలను రైతులు సాగుచేస్తున్న విధానాల మీద స్థానిక రైతులతో బాల్క సుమన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మూడు రోజులుగా తమ పర్యటనకు సహకరించిన మహారాష్ట్ర రైతులకు విప్ కృతజ్ఞతలు తెలిపారు.