బాణం వర్సెస్ ఈటెల

మంచిర్యాల : ఈసారి సింగరేణి ఎన్నికల్లో పోటీ ఎవరి మధ్య జరిగినా ఎంతో రసవత్తరంగా మారనుంది. ఎందుకంటే ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. గుర్తింపు సాధించాలని అన్ని యూనియన్లు పట్టుదలతో రంగంలోకి దిగనున్నాయి. కానీ, ఇవి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి చాలా అవసరం. అందుకే ఆ యూనియన్ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇక ఆ యూనియన్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి బీఎంఎస్ తరఫున ఈటెల రాజేందర్ బరిలో దిగనున్నారు.
సింగరేణి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో అన్ని సంఘాలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అన్ని కార్మిక సంఘాలు కార్మికుల దగ్గరకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నాయి. అన్ని సంఘాలు గుర్తింపు ఎన్నికలకు దృష్టిలో పెట్టుకుని తమ కార్యాచరణ రూపొందించుకుంటున్నాయి. ఇప్పటికే కార్మిక సంఘాలన్నీ కార్మిక క్షేత్రంలోకి దిగాయి. గుర్తింపు ఎన్నికల్లో విజయం సాధించేందుకు కార్మిక సంఘాలు తమ కార్యాచరణ రూపొందించుకున్నాయి. కార్మికులకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏ చిన్న సమస్య వచ్చినా వారి పక్షాన నిలిచేందుకు సిద్ధంగా ఉంటున్నారు.
ఇక ఈ ఎన్నికలు టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. గుర్తింపు సంఘంలో ఈసారి కూడా గెలిచి ఆరు జిల్లాల్లో పట్టు నిలుపుకునేందుకు ముందుకు సాగుతోంది. ఈ మేరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చేసిన పనులు చెప్పడటంతో పాటు యూనియన్ నేతలు గనులు, డిపార్ట్‌మెంట్లు, ఓపెన్‌కాస్టులపై ప్రచారం చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. యూనియన్ నేతలతో పాటు సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రజాప్రతినిధులు, ఎమ్మె్ల్యేలు, ఎంపీలు అందరూ ఇక్కడే పాగా వేయనున్నారు. ఆ యూనియన్ తరఫున గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బరిలో దిగుతారు. ఇప్పటికే ఆ యూనియన్ అన్ని రకాలుగా వ్యూహాలు రచించుకుని ముందుకు సాగుతోంది.
ఈసారి ఎన్నికల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనున్న వ్యక్తి ఈటెల రాజేందర్. హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలిచి గెలిచారు. ఆయన గెలుపుతో తెలంగాణలో ఒక రకంగా కుదుపువచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ అనుబంధ సంఘం భారతీయ మజ్దూర్ సంఘ్ నుంచి ప్రచారం చేయనున్నారు. సింగరేణిలో టీబీజీకేఎస్ ఏర్పాటులో ఈటెల కీలకపాత్ర పోషించారు. సింగరేణిలో ఉన్న చాలా మంది నేతలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా కార్మిక సంఘ నేతలతో ఆయనకు ఎనలేని అనుబంధం ఉంది. దీంతో ప్రత్యక్షంగా ఆయనే రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రైవేటీకరణపై చర్చలకు సిద్ధమంటూ సమరశంఖం సైతం పూరించారు.
మిగతా యూనియన్లు సైతం తమ పోరాటాన్ని కొనసాగించనున్నాయి. ఐఎన్‌టీయూసీ తరఫున రేవంత్‌రెడ్డి, సీతక్క ప్రచారం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ సైతం సర్వశక్తులు ఒడ్డి సింగరేణి ఎన్నికల్లో పోరాటం చేయనుంది. ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్ సైతం గుర్తింపు సంఘం ఎన్నికల్లో పూర్తి స్థాయిలో గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.