జగ్గారెడ్డికి ఝలక్..
అన్ని బాధ్యతల నుంచి తొలగింపు
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఊహించని షాకిచ్చింది. పార్టీకి సంబంధించిన అన్ని బాధ్యతల నుంచి ఆయన్ని తప్పిస్తున్నట్లు సోమవారం కీలక ప్రకటన చేసింది. పార్టీకి సంబంధించి ఆయన నిర్వర్తించే బాధ్యతలను మిగిలిన ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది.
టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించినప్పటి నుంచి జగ్గారెడ్డి ఆయనపై గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. సభలు, సమావేశాలతో రేవంత్ పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని నింపుతుంటే.. ఆయన వ్యవహార శైలిపై జగ్గారెడ్డి విమర్శలు చేస్తూ వస్తున్నారు. పార్టీలో ఎందరో సీనియర్లు ఉండగా వేరే పార్టీ నుంచి వచ్చిన రేవంత్‌కి పీసీసీ చీఫ్ పదవి ఎలా కట్టబెట్టతారని ఆయన బాహాటంగానే విమర్శించారు. ఈ నేపథ్యంలోనే కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడనున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు. అయితే సోనియా, రాహుల్‌గాంధీతో అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నానని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటానని యూటర్న్ తీసుకున్నారు.
తాజాగా సీనియర్ నేతలంతా కలిసి రహస్యంగా నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరుకావడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి ఠాగూర్‌పై విమర్శలు గుప్పించారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి తీరును తీవ్రంగా పరిగణించిన హైకమాండ్.. ఆయన్ని కేవలం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంచి.. మిగిలిన పార్టీ బాధ్యతలన్నింటి నుంచి తప్పించింది.