వాళ్లు కూడా మనుషులే సారూ…
మంచిర్యాల : అంతా ఒకే కుటుంబం… సింగరేణిలో ఎక్కడ చూసినా కనిపించే స్లోగన్.. కానీ అది కేవలం గోడల మీద, పత్రికా ప్రకటనలకే తప్ప నిజం కాదు… అధికారులు ఏసీల్లో కూర్చుని ఉద్యోగులను కనీసం పట్టించుకునే దుస్థితి కూడా ఉండదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణే.. పైన ఉన్న ఫొటో..
ఒకే లక్ష్యం.. ఒకే కుటుంబం అని సింగరేణి యాజమాన్యం, అధికారులు నిత్యం వల్లిస్తుంటారు. కానీ కింది స్థాయి ఉద్యోగులను ఏ మాత్రం పట్టించుకోరు. బెల్లంపల్లి ఏరియా లోని జీఎం ఆఫీసు ఆవరణలో మంగళవారం కారుణ్యం, ఇతర కారణాల వల్ల అన్ఫిట్ అయిన ఉద్యోగుల కోసం ఇంటర్వ్యూలు నిర్వహించారు. సింగరేణిలో పనిచేసి రిటైర్ అయిన వారు, అన్ఫిట్ వారు తమ పిల్లా పాపలతో బయట ఎండలో మెట్లపైన కూర్చుండిపోయారు. అధికారులు ఏసీల్లో కూర్చుని వారిని బయట కూర్చోపెట్టడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ఇన్నేండ్లు చెమటోడ్చి కష్టపడి పని చేస్తేనే అధికారులు ఏసీల్లో కూర్చోగలుతున్నారని, అలాంటి వారిని కనీసం పట్టించుకోకపోవడం ఏమిటని దుయ్యబడుతున్నారు. చంటి పిల్లలు ఉన్నారని కూడా చూడకుండా ఎండలో మెట్లపై కూర్చోపెట్టడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు నెలల పాప తల్లి కూడా మెట్ల పైన కూర్చొని గంటల పాటు ఉండటం సింగరేణి నిర్లక్ష్యానికి నిదర్శనమని దుయ్యబట్టారు.
సంస్థ కోసం పనిచేసిన ఉద్యోగులను ఇలా అవమానించడం సరికాదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు మల్రాజు శ్రీనివాస్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని గౌరవించి, వారికి సౌకర్యాలు కల్పించాల్సింది పోయి కనీసం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా ఇంటర్వ్యూ కోసం వచ్చే మాజీ కార్మికులకు కార్మిక కుటుంబ సభ్యులకు వారిని గౌరవంగా చూడాలని డిమాండ్ చేశారు. వారికి సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.