సింగరేణిలో రూ. 50 వేల కోట్ల స్కాం..
సింగరేణి కోల్ మైన్స్‌లో రూ.50 వేల కోట్ల స్కాం జరుగుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో నెలకొన్న పరిస్థితులపై తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు వివరించేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఢిల్లీలో మీడియాతో కేసీఆర్ దోపిడీని కేంద్రం చూసిచూడనట్లుగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిపై ప్రధానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. సీబీఐ చేత పూర్తి స్థాయిలో విచారణ జరపాలని కోరుతూ ఇచ్చిన విజ్ఞప్తిపై ప్రధాని వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి దోపిడీపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్నారు. సింగరేణి స్కాంపై కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ ప్రక్రియ జరుగుతున్నా సీఎండీ శ్రీధర్‌పై డీఓపీటీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సింగరేణి స్కాంపై దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ప్రతిమా శ్రీనివాస్ కంపెనీకి నిబంధనలు ఉల్లంఘించి గనులు కేటాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సింగరేణి అంశంపై ప్రధాని సీబీఐ విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్‌కు తమ ఫిర్యాదు బదిలీ చేయాలని ఆయన కోరారు.