ట్వీట్ వార్
-ధాన్యం కొనుగోలుపై తెలుగులో ట్వీట్ చేసిన రాహుల్
-విరుచుకుపడిన కల్వకుంట్ల కవిత, హరీష్‌రావు
-ప్రతి కౌంటర్ ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
ఒకే ఒక్క ట్వీట్ తెలంగాణలో వేడిని రాజేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలుగులో చేసిన ట్వీట్ కాస్త రాజకీయ వేడిని పెంచింది. ఇన్ని రోజులు బీజేపీపై విరుచుకుపడుతున్న టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణమయ్యాయి. కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన టీఆర్ఎస్ నేతలకు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. ఒక్క ట్వీట్‌తో ధాన్యం కొనుగోళ్ల వ్యవహారం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారిపోయింది. ధాన్యం కొనుగోలులో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ సర్కార్ తమ నైతిక బాధ్యత విస్మరించాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలుగులో చేసిన ట్వీట్ హీట్ రాజేసింది. ఇప్పటి వరకూ బీజేపీపై విరుచుకుపడుతోన్న గులాబీ పార్టీ.. ఆ ఒక్క ట్వీట్‌తో కాంగ్రెస్‌తోనూ కయ్యానికి సిద్ధమైంది.
ధాన్యం కొనుగోలు అంశంలో రాహుల్ గాంధీ స్పందించారు.. ధాన్యం కొనుగోలు అంశంపై మంగళవారం తెలుగులో ట్వీట్ చేశారు. ‘తెలంగాణలో పండిన చివరి గింజ కొనే వరకూ, రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి’ అంటూ డిమాండ్ చేశారు. దీంతో అటు కల్వకుంట్ల కవిత, మంత్రి హరీష్ రావు రాహుల్ ట్వీట్‌పై మండిపడ్డారు.
తెలంగాణపై దొంగ ప్రేమ, మొసలి కన్నీరు ఆపండంటూ తెలంగాణ మంత్రి, సీనియర్ నేత హరీశ్ రావు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ ప్రజల మేలు కోరుకునే వాళ్లే అయితే పార్లమెంట్‌లో మా ఎంపీలతో కలిసి ఆందోళన చేయాలని హరీశ్ సవాల్ చేశారు. రైతులు ఉసురుపోసుకుంటున్న కేంద్రం తీరును ఎండగట్టే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. టీఆర్ఎస్ కోరుతోన్న వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్‌మెంట్ నినాదంపై కాంగ్రెస్ పార్టీ విధానమేంటో స్పష్టం చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతుల విషయంలో కూడా రాజకీయాలు చేసి మీ పరువును తీసుకోవద్దంటూ కాస్త ఘాటుగానే హెచ్చరించారు. అసలు ట్వీట్ పెట్టినోడిని అనాలి.. ధాన్యం ఎవరు కొంటారో తెలియని అయోమయ స్థితిలో ఉన్నావా? అంటూ రాహుల్ గాంధీని టార్గెట్ చేశారు. నువ్వు వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ నేతవి అంటూ ఎద్దేవా చేయడమే కాకుండా.. అందుకే మిమ్మల్ని ‘‘జాతీయ పప్పు’’ అని బీజేపీ వాళ్లు అన్నారంటూ వ్యక్తిగత విమర్శలకు దిగారు.
అంతకుముందే కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్‌పై స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం ట్విట్టర్లో సంఘీభావం తెలపడం కాదు.. పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీలకు మద్దతుగా వెల్‌లోకి వచ్చి నిరసన తెలియజేయాలన్నారు. ఈ ట్వీట్‌లకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రతిదాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మంత్రి చేసిన వ్యాఖ్యలకు ఆయన సీరియస్‌గా స్పందించారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో కేంద్రానికి రాసిచ్చిన లేఖను ఆయన బహిర్గతం చేశారు. బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని వరి రైతులకు ఉరి బిగించింది కేసీఆరేనని రేవంత్ విమర్శించారు. చల్లని చూపు కోసం అల్లుడి ఆరాటం చూస్తుంటే జాలేస్తోందంటూ సాలిడ్ పంచ్ విసిరారు. అంతేకాకుండా టీఆర్ఎస్ పార్టీ ఎంపీలపై కూడా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఫొటోషూట్‌లు చేస్తున్నారంటూ పరోక్ష విమర్శలు చేశారు. తాము ఫొటోషూట్‌లు చేయమని.. రైతుల కోసం నిఖార్సుగా ఫైట్ చేస్తామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవిత, మంత్రి హరీశ్ రావు టార్గెట్‌గా వరుస ట్వీట్లు చేశారు.