3 నెలల ఆడపిల్లతో వ్యాపారం.. ఏడుసార్లు అమ్మేశారు..
అభం.. శుభం తెలియని పసికందు… పసిపిల్లను పెంచి పెద్ద చేయాల్సిన తండ్రి మూడు నెలలకే 70 వేల రూపాయలకు అమ్మేశాడు. కేవలం తండ్రే కాదు.. ఒకరి తర్వాత ఒకరు ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ఆ పసికందుతో వ్యాపారం చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి…
గుంటూరు జిల్లా మంగళగిరిలోని గండాలయపేటకు చెందిన మెడబలిమి మనోజ్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మూడు నెలల కిందట అతని భార్య మరో ఆడపిల్లకు జన్మనిచ్చింది. మూడవ పాపను పోషించలేక అమ్మేందుకు సిద్ధపడ్డాడు. అదే ప్రాంతానికి చెందిన మిక్కిలి నాగలక్ష్మి అనే మహిళ సహాయంతో నల్గొండ జిల్లా దామ్రచర్ల మండలం కొండప్రోలు గ్రామానికి చెందిన మేఘావత్ గాయత్రి అనే మహిళకు రూ.70 వేలకు విక్రయించారు. ఇక్కడితో తండ్రి చేతులు దులిపేసుకున్నాడు.
ఏడుసార్లు అమ్మేశారు…
చిన్నారిని కొనుగోలు చేసిన మేఘావత్ గాయత్రి.. నల్గొండ జిల్లాకి చెందిన భూక్యా నందు అనే మహిళకు రూ.లక్షా 20 వేలకు విక్రయించింది. ఆమె భూక్యా బలవర్తిరాజు అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్ దిల్షుక్ నగర్‌కు చెందిన ఎస్కే నూర్జహాన్ అనే మహిళకు రూ.లక్షా 87 వేలకు విక్రయించారు. నూర్జహాన్ తాను కొనుగోలు చేసిన చిన్నారిని ఖమ్మం జిల్లాకు చెందిన అనుభోజు ఉదయ్ కిరణ్ సహాయంతో హైదరాబాద్‌లోని నారాయణగూడకు చెందిన బొమ్మాడ ఉమ్మాదేవి అనే మహిళకు రూ.లక్షా 90 వేలకు విక్రయించారు. ఉమాదేవి ఆ పసికందును విజయవాడ బెంజి సర్కిల్‌కు చెందిన పడాల శ్రావణికి రూ.2 లక్షలకు విక్రయించింది. పడాల శ్రావణి ఆ చిన్నారిని విజయవాడ గొల్లపూడికి చెందిన గరికముక్కు విజయలక్ష్మి అనే మహిళకు రూ.2 లక్షల 20 వేలకు అమ్మేసింది. ఆమె తూర్పు గోదావరి జిల్లా ఏలూరుకు చెందిన వర్రె రమేష్ అనే వ్యక్తికి రూ.2 లక్షల 50 వేలకు విక్రయించింది.
మంగళగిరి టౌన్ సీఐ బి.అంకమ్మరావు పర్యవేక్షణలో ఎస్ఐ ఇ.నారాయణ తన సిబ్బంది సహాయంతో నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. కన్న తండ్రితో సహా 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మూడు నెలల పసికందును సురక్షితంగా కాపాడి సంరక్షణ నిమిత్తం తిరిగి తల్లిదండ్రులకు అప్పగించారు. కేసులో ప్రతిభకనబర్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందికి అర్బన్ ఎస్పీ రివార్డులను ప్రకటించారు.