31 పైసల కోసం రైతును తిప్పలు పెట్టిన బ్యాంక్
అధికారులపై కోర్టు సీరియస్
రైతులంటే అందరికీ చులకనే..ముఖ్యంగా బ్యాంకు అధికారులకు.. కేవలం 31 పైసల కోసం రైతును ముప్పుతిప్పలు పెట్టిన ఓ బ్యాంకు ఘనత వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ సమీపంలో శ్యాంజీ బాయ్ 2020లో తన పేరుమీద ఉన్న కొంత భూమిని రాకేష్ వర్మ, మనోజ్ వర్మలకు విక్రయించాడు. అయితే అంతకంటే ముందే ఈ భూమిపై శ్యాంజీ రూ. మూడు లక్షల పంట రుణం తీసుకున్నాడు.
భూమి అమ్మిన కొద్దిరోజులకు బ్యాంకు నుంచి తీసుకున్న రుణం శ్యాంజీ తిరిగి చెల్లించారు. ఆ తరువాత కొనుగోలుదారులు భూమి రెవెన్యూ రికార్డుల్లోకి తమ పేరును నమోదు చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే దానికి సంబంధించి బ్యాంకు నో డ్యూ సర్టిఫికెట్ ఇవ్వలేదు. దీంతో రెవెన్యూ రికార్డుల్లో వారి పేరు ఎక్కలేదు. బ్యాంకు వద్దకు వెళితే సమస్య పరిష్కారం కాకపోవడంతో కొత్త యజమానులు రెండేళ్ల క్రితం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చింది.. బ్యాంకు నో డ్యూ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వలేదని కోర్టు అడగగా… ఎస్బిఐ తరఫు న్యాయవాది చెప్పిన సమాధానం విని న్యాయమూర్తి అవాక్కయ్యారు. ‘ఆ పత్రాన్ని సిస్టం జనరేట్ చేస్తుంది. రైతు తీసుకున్నరుణంలో ఇంకా 31 పైసలు ఉంది. అందుకే సర్టిఫికెట్ ఇవ్వడం సాధ్యం కాలేదు’ ఎస్బిఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ సమాధానంతో కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం.. 50 పైసల కంటే తక్కువ ఉన్న దాన్ని లెక్కలోకి తీసుకోరు. ఆ రైతు పంట రుణం మొత్తం తిరిగి చెల్లించాడు. అయినా కానీ మీరు సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఇది ప్రజలను వేధించడం కాక మరేమిటి?’ అని కోర్టు ప్రశ్నించింది. బ్యాంకు మేనేజర్ కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు తెలిసింది.