నాది తప్పైతే మంచిర్యాలలో అడుగుపెట్టను
-మీవి తప్పులని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా..?
-తేదీ, వేదిక నిర్ణయిస్తే నేను చర్చకు సిద్ధం
-మీ జీతం ఎంత..? ఆస్తులెన్ని ప్రజలకు చెప్పండి
-ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు

మంచిర్యాల :’నాది తప్పైతే.. నేనే ప్రజలకు వ్యతిరేకమని తేలితే నేను మంచిర్యాలలో అడుగుపెట్టను.. మీవి తప్పులు అని తేలితే రాజకీయాల నుంచి తప్పుకుంటారా..?’ అని ఏఐసీసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్ రావు ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు సవాల్ చేశారు. ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే తనతో చర్చకు సిద్ధం కావాలన్నారు. తేదీ, వేదిక నిర్ణయిస్తే తాను వస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దివాకర్ రావు తప్పుడు ప్రచారాలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. ఇక ముందు తనపై అసత్య ఆరోపణలు చేస్తే ఎమ్మెల్యే పై వంద కోట్ల రూపాయల కు పరువు నష్టం దావా వేస్తానని తెలిపారు. తన తాబేదార్లు కిందిస్థాయి క్యాడర్ తో తనపై సోషల్ మీడియాలో, సభలు, సమావేశాల్లో తప్పుడు ప్రచారాలు చేస్తే వారిపై కూడా 10 కోట్ల రూపాయలకు దావా వేస్తానన్నారు.
ఎవరి జీవితం ఏమిటో ప్రజలకు బాగా తెలుసన్నారు. తాను కష్టపడి వ్యాపార రంగంలో అంచెలంచెలుగా ఎదిగానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే దివాకర్రావు లాగా తప్పుడు వ్యవహారాలు చేస్తూ ఒకసారి ఎదగలేదని తెలిపారు. తన పర్సనల్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఇప్పటికైనా మానుకోవాలన్నారు. గోదావరి నది తీరాన బ్యాక్ వాటర్తో అన్ని ప్రాంతాలు మునిగిపోతుండగా అక్కడే స్మశాన వాటిక నిర్మించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పైగా మంచిర్యాల ప్రజల విరాళాలతో ఇలాంటి భూమి కొనుగోలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నీటిలో మునిగిపోయే భూమిని కోటి 20 లక్షలు పెట్టి ఎలా కొనుగోలు చేస్తారన్నారు. మంచిర్యాల ప్రభుత్వ భూములు ఉండగా ఆ ప్రాంతంలో స్మశాన వాటిక నిర్మించకుండా ప్రజల నుంచి బలవంతంగా డబ్బు సేకరించి భూమి కొనుగోలు చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. అంతర్గాంలో ఉన్న భూములకు విలువ పెంచడం కోసం కాలేజ్ రోడ్ లో అభివృద్ధి చేస్తున్నాడని విమర్శించారు.
ఎమ్మెల్యే దివాకర్ రావు అవినీతి అక్రమాలతో కోట్లాది రూపాయలు గడించారని, ఇవాళ ఎమ్మెల్యే ఇంటిలో ప్రతి ఒక్కరికి ఖరీదైన వాహనాలు, వందల ఎకరాల భూములు ఎక్కడి నుండి వచ్చాయని ఏం వ్యాపారాలు చేసి సంపాదించారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా వచ్చే జీతం ఎంత ? వందలాది ఎకరాల భూములు ఎలా వచ్చాయని గతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టులో వచ్చిన కమీషన్ డబ్బులతో లండన్లో ఉన్న కొడుకుకు కోట్లాది రూపాయల విలువ చేసే ఇల్లు కొనుగోలు చేసి ఇచ్చాడని ఆరోపించారు. నాలుగు సార్లు గెలిచిన ఎమ్మెల్యే మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు ఒరగబెట్టింది ఏమీ లేదని ఆరోపించారు.