మీ లక్ష్యానికి మేం చేయూతనిస్తాం
-యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలి
-చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్
-జిల్లావ్యాప్తంగా యువతకు స్పోర్ట్స్ కిట్ల పంపిణీ

మంచిర్యాల :యువత అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలని అందుకు తమ వంతు సహాయ,సహకారాలు అందిస్తామని చెన్నూర్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ వెల్లడించారు. మంగళవారం కోటపల్లి,మల్లంపేట్,ఎసన్‌వాయి గ్రామాలలోని యువతకి క్రికెట్, వాలీబాల్ కిట్స్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యువత చెడు మార్గాలు నడవద్దన్నారు. యువత క్రీడల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. మీ గ్రామానికి గుర్తింపు తీసుకురావాలని, అసాంఘిక శక్తుల గురించిన ఎటువంటి సమాచారమైనా పోలీసులకు అందించాలన్నారు. కార్యక్రమంలో కోటపల్లి ఎస్సై వెంకట్, రవికుమార్ పాల్గొన్నారు.
బంగారు భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు
యువత చెడు అలవాట్లకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని భీమిని ఎస్ఐ తెలిపారు. భీమిని పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లిడి,లక్ష్మీపూర్లో యువతకి వాలీబాల్, క్రికెట్ కిట్లను అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ…. యువకులు ఉన్నత విద్య నేర్చుకోవాలన్నారు. వారి తల్లిదండ్రులకి మంచి పేరు తేవాలని కోరారు.
దేశ భవిష్యత్తుకు యువత కేంద్ర బిందువు..
దేశ భవిష్యత్తుకు కేంద్ర బిందువు యువత అని నెన్నల ఎస్ఐ రాజశేఖర్ స్పష్టం చేశారు. నెన్నల మండలం పెద్ద లంబాడీ తండా యువకులకు క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ యువత తలచుకుంటే ఎన్నో విజయాలను సునాయాసంగా అందుకోవచ్చన్నారు. అంతటి శక్తి యువతకి ఉందన్నారు. యువకులు చెడు అలవాట్లకు బానిస కాకుండా వ్యాయామం చేసి, ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు.
సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దు..
యువత సంఘ విద్రోహ శక్తులకు సహకరించవద్దని కాసిపేట ఎస్ఐ విజేందర్ కోరారు. దేవాపూర్ పోలీస్ స్టేషను పరిధిలోని అచ్యుతరావు గూడ, గట్టురావు పల్లి యువత కి వాలీబాల్, క్రికెట్ కిట్స్ అందచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మీకు ఏదైనా మాకు చెబితే దాని పరిష్కారానికి కృషి చేస్తామని వెల్లడించారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని అన్నారు.