ఆందోళన వద్దు.. అండగా ఉంటాం..
-కోయపోశగూడ బాధితులకు ప్రేంసాగర్ రావు ఫోన్
-బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందచేత
మంచిర్యాల : ‘మీకు అండగా ఉంటాం… భయపడాల్సిన పని లేదు. న్యాయపరంగా ఎలాంటి సాయం కావాలన్నా చేస్తామ’ని ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్ రావు స్పష్టం చేశారు. ఆయన కోయపోశగూడ బాధిత కుటుంబాలతో మాట్లాడారు. దండేపల్లి మండలం కోయపోశగూడలో పోడు వ్యవసాయం చేసే 19 మంది ఆదివాసీ మహిళలపై అటవీ అధికారులు కేసులు నమోదు చేశారు. వారిని ఆదిలాబాద్ జైలుకు పంపించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఆయన వారితో ఫోన్లో మాట్లాడారు. మీకు కాంగ్రెస్ ఎల్లప్పుడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. న్యాయపరమైన సాయం కూడా అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దండేపల్లి మండల ఎంపీటీసీలు ముత్యాలశ్రీనివాస్, కందిహేమలత, యూత్ అధ్యక్షులు ఆకుల దుర్గప్రసాద్, సర్పంచ్ ప్రేమలత,బోడకుంటి శంకరయ్య,అత్తె వెంకటేష్, MD సల్లు తదితరులు పాల్గొన్నారు. కోట్నాక తిరుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోయపోశ గూడ ఆదివాసీ మహిళలు, యువకులు పాల్గొన్నారు.