అల్లుడు బెల్లం.. అడవి బిడ్డలు అల్లం అయ్యారు..
-మంత్రి అల్లోలపై ఏఐసీసీ నేత ఏలేటి ఆగ్రహం
- అధికారులను సస్పెండ్ చేసి అట్రాసిటీ కేసు పెట్టాలి
-నిర్మల్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా

నిర్మల్ : పచ్చి బాలింత, వృద్ధులు అని కూడా చూడకుండా ఆదివాసీ కుటుంబాలను అన్యాయంగా జైలు పాలు చేశారని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల కన్వీనర్ ఏలేటిమహేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గిరిజన మహిళలను అరెస్టు చేసి జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ ఆదివాసీల,కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో ఆదివాసీ కుటుంబాలపై కేసు నమోదు చేసి 12 మందిని అన్యాయంగా జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అల్లుడు అటవీ శాఖ భూమి ఆక్రమించాడని తేలినా వదిలి పెట్టారని ధ్వజమెత్తారు. ఆదివాసీ బిడ్డలకో న్యాయం.. మీ అల్లుడికో న్యాయమా..? అని మంత్రిని సూటిగా ప్రశ్నించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న ఆదిమ గిరిజనులకు పట్టాలు ఇప్పించాల్సింది పోయి బాధ్యత మరిచిపోయి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గిరిజనులను జైల్లో పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. జైల్లో పెట్టిన ఆదిమ గిరిజనులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తాము పరామర్శించేందుకు వెళ్లామని వారి పరిస్థితి చూస్తే ఎంతటి వాడైనా ఏడవకుండా ఉండలేరని ఆవేదన వ్యక్తం చేశారు. తడకలు అల్లుకునే వెదురు కోసం వెళ్లిన అడవి బిడ్డలపై అక్రమంగా కేసులు బనాయించి జైల్లో పెట్టడం ఏ మేరకు సమంజసం అని ప్రశ్నించారు.
గర్భిణీలు, వృద్ధులు అని కూడా చూడకుండా అటవీ అధికారులు దౌర్జన్యంగా కొట్టడంతో పాటు కింద పడేసి బూటు కాళ్లతో తన్నినట్లు గిరిజనులు తమతో ఆవేదన వ్యక్తం చేశారని మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు ఇందుకు కారణమైన అటవీ రేంజ్ అధికారి నర్సింగ్ రావు తో పాటు ఇతర అధికారుల పై సస్పెన్షన్ వేటు వేయాలన్నారు. అటవీ అధికారుల పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గిరిజనుల పక్షాన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. జైల్లో ఉన్న వారికి బెయిల్ ఇచ్చే చివరిక్షణంలో మళ్లీ కేసులు పెట్టి వారిని జైల్లోనే ఉండేలా చేశారని ఆరోపించారు.
ఇంత జరుగుతున్నా అటవీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. చిన్న కేసులకి అడవి బిడ్డలను జైల్లో పెట్టిన అటవీ అధికారులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అల్లుడు అటవీ భూములను ఆక్రమించినట్లు శాటిలైట్ తో గుర్తించినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మంత్రి అల్లున్ని కూడా వెంటనే జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. నిర్మల్ చుట్టుపక్కల మంత్రి బంధువులు కుటుంబీకులు ఇష్టారాజ్యంగా చెరువుల కబ్జాలకు పాల్పడుతున్నా ఈ ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.