సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది
-ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు చెల్లించాలి
-రాజకీయ జోక్యంతో కార్మికులకు కష్టాలు
-భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య
రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి, యాజమాన్య మొండివైఖరి వల్ల సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని భారతీయ మజ్దూర్ సంఘ్ అధ్యక్షుడు యాదగిరిసత్తయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం-III APA ALP గనిలో గేట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సింగరేణి పరిశ్రమ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్న రాష్ట్రప్రభుత్వం, దానికి వత్తాసు పలుకుతున్న యాజమాన్యం పోకడలకు కార్మికులు అడ్డుకట్ట వేయాలని కోరారు. ప్రతి కార్మికుడు సైనిక పాత్ర పోషించి సంస్థను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
సింగరేణికి న్యాయంగా రావాల్సిన మొండి బకాయిలు పేరుకుపోయాయన్నారు. అవిసుమారు రూ.25,000 కోట్ల రూపాయలని స్పష్టం చేశారు. యాజమాన్యం, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అప్పులు పెరిగాయన్నారు. తక్షణమే బకాయిలను సింగరేణి సంస్థకు చెల్లించే విధంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే దీర్ఘకాలిక ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. ఇష్టారీతిన సింగరేణి నిధులను దారి మళ్లిస్తున్నారని దుయ్యబట్టారు.
సింగరేణిలో బినామీ సంస్థలను ప్రోత్సహిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిలో 4 బొగ్గు బ్లాకులకు యాజమాన్యం టెండర్లు వేయకుండా అడ్డుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ గ్రౌండ్ బొగ్గు గనుల్లో ప్రైవేటు కాంట్రాక్టు వారితో బొగ్గు ఉత్పత్తికి అనుమతి ఇస్తున్నారని దీనికి అర్ధం ఏమిటని ప్రశ్నించారు. ఇవన్నీ కంపెనీని భవిష్యత్ లో నిండా ముంచటానికి చేస్తున్న చర్య లేనన్నారు.సింగరేణి ఓపెన్ కాస్టులో గతంలో ఓవర్ బర్డెన్ మాత్రమే ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలు తీసేవని, TRS అధికారంలోకి రాగానే బొగ్గు సైతం తీసేందుకు అనుమతులు ఇచ్చారని దుయ్యబట్టారు. గుర్తింపు సంఘం TBGKS వ్యతిరేకించకపోవడం వల్ల ప్రైవేటుకు అనుమతులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయంతో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో పని చేస్తున్న అనేక వేలమంది కార్మికుల ఉద్యోగ భద్రత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణికి విద్యుత్తు సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 25,000 కోట్లు సింగరేణికి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఓపెన్‌కాస్ట్, అండర్ గ్రౌండ్లో బొగ్గు ఉత్పత్తి చేసే పనిని ప్రైవేటు కాంట్రాక్టులకు ఇవ్వడం తక్షణమే మానుకోవాలన్నారు. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్ కమిటీ వేతనాలు చెల్లించాలన్నారు. సింగరేణి కార్మికులకు సొంత ఇంటి పథకంతో పాటు జిల్లా కేంద్రాలలో 250 గజాల స్థలంతో పాటు రూ. 50 లక్షల వడ్డీలేని ఋణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. BMS నాయకత్వంలో సింగరేణి సంస్థను కాపాడుకోవటానికి చేయబోయే ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయటానికి కార్మికులు ఐక్యంగా కలిసి రావాలన్నారు. కార్యక్రమంలో ఏరియా ఉపాధ్యక్షుడు అరుకాల ప్రసాద్, వై సారంగపాణి, వేణు గోపాల్ రావు, మామిడి స్వామి, అనుప రమేష్,ఆర్ సంపత్,సంసాని సత్యనారాయణ, కంప రమేశ్, వల్లెపు సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు