ప్రజా జీవనానికి భంగం కలిస్తే చర్యలు తప్పవు
మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి

మంచిర్యాల – ప్రజా జీవనానికి భంగం కలిగినా, ఆస్తులను ధ్వంసం చేసినా చట్ట ప్రకారం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని మంచిర్యాల ఏసీపీ తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు. మంచిర్యాల సబ్ డివిజన్ పరిధిలోని ఆర్మీ ఉద్యోగాలకు ఎన్నికైన, ప్రయత్నం చేస్తున్న 30 మంది యువకులకు మంచిర్యాల ఏసీసీ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ ప్రజా జీవనానికి విఘతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. వివిధ ఉద్యోగాలకు ప్రభుత్వం ప్రకటనలు వస్తున్నాయని, యువత లక్ష్యసాధనకు చదువుకోవాలన్నారు. అల్లరులు, విధ్వంసాలకు పాల్పడేవారు క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుంటే జీవితం అంధకారంగా మారుతుందన్నారు. ప్రస్తుతం వివిధ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడిన నేపథ్యంలో యువత ఉద్యోగాలకు సిద్ధంకావాలన్నారు. కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ సీఐ నారాయణ, జన్నారం ఎస్ఐ సతీష్,దండేపల్లి ఎస్ఐ సాంబమూర్తి,సీసీసీ నస్పూర్ ఎస్సై శ్రీనివాస్,లక్షెట్టిపేట ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.