ఉపాధ్యాయులపై కక్ష సాధింపు

-టీచర్లను వేధిచేందుకే ఈ అదేశాలు
-సర్కారీ విద్య ధ్వంసం చేశారు
-దమ్ముంటే ముందు మీ ఆస్తులు ప్రకటించండి
-బీజేపీ శాసన సభా పక్ష నాయకుడు రాజాసింగ్

ఉద్యోగ,ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోందని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు రాజాసింగ్ దుయ్యబట్టారు. టీచర్లతో సహా,విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని కేసీఆర్ దొంగల్లాగా చూస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయుల ఆస్తులు వెల్లడించాలని ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో విలేకరులతో మాట్లాడారు.విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆర్థిక వివరాలు ఇవ్వాలని విద్యాశాఖ ప్రొసీడింగ్స్ ఇవ్వడం కక్ష సాధింపులో భాగమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపాధ్యాయుల ప్రాపర్టీ స్టేట్ మెంట్ కోరుతున్న ప్రభుత్వం సీఎంతో సహా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రాపర్టి స్టేట్ మెంట్ ముందుగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీచర్లను వేధించేందుకే ఈ ఆదేశాలిచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. 317 జీవోతో ప్రభుత్వం చేపట్టిన బదిలీ ప్రక్రియ కొందరు టీచర్లు వ్యతిరేకించినందు వల్లనే రాష్ట్ర ప్రభుత్వం వాళ్లపై కక్షసాధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2014లో ఈ ప్రభుత్వం రాకముందు టీఆర్ఎస్ నాయకుల ఆస్తులు, నేడు వాళ్ల ఆస్తుల్ని ముందుగా ప్రకటించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధ్యాయులకు ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి ఏవో రూల్స్ చెబుతూ వేధిస్తారా…? అని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ పభుత్వం వచ్చాక సర్కారీ బడుల్లో విద్యను పుర్తిగా ధ్వంసం చేసిందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యికి పైగా పాఠశాలల్ని మూసేసిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. మిగిలిన పాఠశాల్లో పనిచేసే ఉపాధ్యాయుల్ని కూడా భయభ్రాంతులకు గురిచేస్తోందన్నారు. అవినీతికి ఆస్కారం ఉన్న శాఖలు ఏంటో ప్రభుత్వానికి తెలియదా..? అని ప్రశ్నించారు. వేల కోట్ల అవినీతి జరుగుతుందన్న ఆరోపణలున్న శాఖలపై ఈ ప్రభుత్వం ఎందుకు దృష్టిపెట్టలేదన్నారు.

ఆ అవినీతిలో ప్రభుత్వ పెద్దలకు వాటాలు అందుతున్నాయన్న విమర్శలకు ఏం సమాధానం చెబుతారన్నారు. మీకు దమ్ముంటే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మీ పార్టీ నాయకుల ఆస్తుల వివరాలను ముందుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించలేవన్న చరిత్రను గుర్తు చేసుకోవాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like