కొత్త ఓపెన్‌కాస్టుల నుంచి ఉత్పత్తి
-నైనీ,వి.కె. ఓపెన్‌కాస్టుల నుంచి త్వరలోనే ఉత్పత్తి
-ఆర్.జి.,గోలేటి ఓపెన్‌కాస్టుల నుంచి సైతం ఏడాది చివరికల్లా బొగ్గు వెలికితీత
-కొత్త గనుల సమీక్ష సమావేశంలో సీఅండ్ఎండీ ఎన్.శ్రీధర్

కొత్తగా ఏర్పాటవుతున్న ఓపెన్‌కాస్టుల నుంచి ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభించాలని సింగరేణి సీఅండ్ఎండీ శ్రీధర్ స్పష్టం చేశారు. సింగరేణి భవన్లో మంగళవారం ఆయన కొత్త గనులపై ప్రత్యేక సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ఆర్ధిక సంవత్సరంలో నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం ఒడిస్సా రాష్ట్రంలోని నైనీ బొగ్గు బ్లాకు, కొత్తగూడెం ఏరియాలోని వి.కె. ఓపెన్ కాస్ట్, రామగుండం రీజియన్ లోని ఆర్.జి. కోల్ మైన్, గోలేటి ఓపెన్‌కాస్టు గనుల నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలన్నారు. దీనికి అవసరమైన అనుమతులు, టెండర్ ప్రక్రియ కాలపరిమితికి లోబడి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నైనీ బొగ్గు బ్లాకుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న స్టేజీ2 క్లియరెన్స్ అనుమతులు వెంటనే సాధించాలన్నారు. సెప్టెంబర్ నాటికల్లా ఈ గని నుండి ఉత్పత్తి ప్రారంభించాలని తెలిపారు. గని నుండి సమీపంలోని రైల్వే సైడింగ్ వరకు బొగ్గు రవాణాకు ట్రాన్స్ పోర్ట్ కాంట్రాక్టు టెండర్ తక్షణమే ఖరారు చేయాలని ఆదేశించారు.
కొత్తగూడెం వి.కె. ఓపెన్ కాస్ట్ గనికి సంబంధించి మిగిలి ఉన్న అనుమతులను పూర్తి చేసుకుని నవంబర్ లో ఉత్పత్తి ప్రారంభించడానికి సంసిద్ధం కావాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ గని నుండి 10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలన్నారు. రామగుండం రీజియన్ లో గతంలో మూతబడిన భూగర్భ గనుల ప్రాంతాలను కలుపుతూ కొత్తగా చేపట్టిన రామగుండం కోల్ మైన్, బెల్లంపల్లి ఏరియాలో రెండు మూతబడిన భూగర్భ గనులు, అబ్బాపూర్ బ్లాకుతో కలిపి చేపడుతున్న గోలేటి ఓపెన్ కాస్ట్ గని నుండి కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే బొగ్గు ఉత్పత్తి ప్రారంభించడానికి సంబంధిత అధికారులు, ఏరియా జీఎం లు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలన్నారు.
రానున్న ఆర్థిక సంవత్సరం 2023`24 లో ప్రారంభించనున్న జె.కె. ఓపెన్ కాస్ట్ (రొంపేడు ఓపెన్ కాస్ట్) గని, ఎంవి.కె. ఓపెన్ కాస్ట్ గని, తాడిచెర్ల ఓపెన్‌కాస్ట్ 2 గని, మరికొన్ని ఇతర గనులకు సంబంధించి ప్రతిపాదనలు అనుమతలపై చర్చించారు. సమావేశంలో ఆయనతో పాటు సంస్థ డైరెక్టర్లు ఎస్.చంద్రశేఖర్ (ఆపరేషన్స్), ఎన్.బలరామ్ (ఫైనాన్స్, పర్సనల్, పి&పి), డి.సత్యనారాయణరావు (ఇ&ఎం), అడ్వయిజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, జీఎం (సిడిఎన్) కె.సూర్యనారాయణ, జీఎం (సిపిపి) కె.కొండయ్య, జీఎం (మార్కెటింగ్) ఎం.సురేష్ పాల్గొన్నారు.