జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించిన మోడీ

నూతనంగా నిర్మిస్తోన్న పార్లమెంట్ భవనం పైకప్పుపై కాంస్యంతో ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించారు. సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ఆవిష్కరించారు. దీన్ని పూర్తిగా కాంస్యంతో నిర్మించారు. ఇది 6.5 మీటర్ల ఎత్తు, 4.4 మీటర్ల వెడల్పు ఉంది. ఈ చిహ్నం బరువు 9,500 కిలోలు. విగ్రహావిష్కరణ అనంతరం కొత్త పార్లమెంట్ భవన నిర్మాణంలో పాలు పంచుకుంటున్న కార్మికులతో మోడీ ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో మోడీతో పాటు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. ఈ నిర్మాణానికి ఆధారాన్నిచ్చేందుకు 6,500 కేజీల స్టీల్ వాడారు. దీని నిర్మాణానికి తొమ్మిది నెలల సమయం పట్టినట్లు అధికారులు తెలిపారు.