ఇవి యాజమాన్య హత్యలే..
-ఎవరి మెప్పు కోసం రెస్య్కూ సిబ్బందిని పంపించారు
-వారేమైనా గజఈతగాళ్లా
-శిక్షణ లేకుండా ఎలా పంపిస్తారు
-రెస్య్కూ టీం బయటకు పంపించద్దని గతంలో సర్క్యులర్
-మరి ఆ సర్క్యులర్ కాగితాలు చిత్తు పేపర్లా..?
-ఈ ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారు
మంచిర్యాల:సింగరేణి రెస్య్కూ టీంకు సంబంధించి ఇద్దరు కార్మికులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలం పెసరకుంట గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకోగా గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సింగరేణి రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో మందమర్రి ఏరియాకు చెందిన సీహెచ్.సతీష్, రాము ఇద్దరు గల్లంతయ్యారు. వారి మృతదేహాలు గురువారం ఉదయం లభించాయి. అయితే వీరి మృతికి సంబంధించి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సింగరేణిలో రెస్క్యూ టీంలను ప్రమాదాలు ఎదుర్కొనేందుకు, ప్రమాదాల్లో గాయపడిన వారిని రక్షించేందుకు ఏర్పాటు చేస్తారు. గనుల్లో విష వాయువులు వెలువడినా, అగ్ని ప్రమా దాలు జరిగినా, పై కప్పులు, సైడ్లు కూలిన ఘటనలతోపాటు అరుదుగా నీటిలో చిక్కుకున్న వారిని రక్షించడానికి రెస్క్యూ సభ్యులకు శిక్షణనిస్తారు. అది సింగరేణి రెస్క్యూ టీం చేసే పని. కానీ, ఈ మధ్య కాలంలో సింగరేణి యాజమాన్యం, అధికారులు ప్రభుత్వం మెప్పు పొందేందుకు ఈ రెస్క్యూ సిబ్బందిని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు. వారిని ఇతర ప్రాంతాలకు పంపి వారి ప్రాణాలతో ఆడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పుష్కరాలు, సమ్మక్క జాతర, ప్రభుత్వానికి ఇతర అవసరాలు ఉన్నప్పుడు వీరిని ఆయా ప్రాంతాలకు పంపిస్తున్నారు.
అయితే ఇతర రెస్క్యూ సిబ్బందికి అన్ని రకాలుగా శిక్షణ ఇస్తారు. ముఖ్యంగా వరద ప్రాంతాల్లో ఏ విధంగా వ్యవహరించాలనే దానిపై ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి ఈ శిక్షణ ఇస్తారు. కానీ, సింగరేణి రెస్క్యూ సిబ్బందికి మాత్రం ఇలాంటి శిక్షణ ఉండదు. మరి అలాంటప్పుడు వారిని బయటకు ఎలా పంపించారు…? వారికి ఈత రాకున్నా ఎవరి మెప్పు కోసం ఇద్దరు ప్రాణాలు బలి తీసుకున్నారు..? ఒకవేళ ఈత వచ్చినా… వరదలు, విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలి ఈ సిబ్బందికి తెలియదు కదా..? మరి ఎందుకు పంపినట్లు…? దీనికి ఏ అధికారి బాధ్యత వహించాలి…? ఎవరిపై చర్యలు తీసుకుంటారు..? ఈ ఇద్దరి మృతి సింగరేణి యాజమాన్యం హత్యలే కదా..? మరి యాజమాన్యం, సంబంధిత అధికారులపై హత్య కేసులు నమోదు చేస్తారా..?
ఇక సింగరేణి యాజమాన్యం గతంలో ఓ సర్క్యులర్ జారీ చేసింది. సింగరేణిలో పనిచేస్తున్న రెస్య్కూ టీంలను ఇతర ప్రాంతాలకు ఎక్కడకు పంపించవద్దని 27-09-2016 తేదీన ఈ సర్క్యులర్ విడుదల చేశారు. మరి ఆ సర్క్యులర్‌కు అర్దం ఏమిటి..? అవి కేవలం చిత్తు కాగితాలు మాత్రమేనా..? తాను విధించిన నిబంధనలు తానే తుంగలో తొక్కుతున్న యాజమాన్యం కార్మికుల రక్షణ మాత్రం గాలికి వదిలేసింది. ఆ సర్క్యులర్ పట్టించుకోని వారిపై చర్యలు తీసుకోవాలి కదా..? మరి ఎక్కడా చర్యలు తీసుకోలేదు ఎందుకు.? ఇలా చెప్పుకుంటూ పోతే సమాధానం లేని వందల ప్రశ్నలు..
ఈ సందర్భంగా మరో విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కార్మిక సంఘాల పాత్ర. ప్రస్తుతం సింగరేణి ఉన్న నేతలు, కార్మిక సంఘాలు అన్ని కూడా యాజమాన్యం వైపే తప్ప కార్మికులను కనీసం పట్టించుకోవడం లేదు. కేవలం ఘటనలు జరినప్పుడు హడావిడి చేయడం, ఆ తర్వాత సైలెంట్ అవ్వడం మినహా ఏం ఉండటం లేదు. శ్రీరాంపూర్‌లో గని ప్రమాదం జరిగి నలుగురు కార్మికులు చనిపోతే కేవలం ఇద్దరికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారు. సాంకేతిక కారణాలు చూపించి మిగతా ఇద్దరికి ఇవ్వలేదు. రెస్య్కూ టీంలకు సంబంధించి సర్క్యులర్ ఉంది.. దానిని అమలు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో రెస్య్కూ టీంలను బయటకు పంపించ వద్దని ఎందుకు అడగలేదు. ఎందుకంటే వారికి కేవలం యాజమాన్యం, అధికారుల మెప్పు కావాలి. అంతే.. ఎన్ని చెప్పినా, ఎన్ని చేసినా యాజామన్యం ఇష్టారాజ్యంగా ప్రవర్తించడంతో కార్మికుల ప్రాణాలు మాత్రం గాలిలో కలిసిపోతున్నాయి. సామాన్య కార్మికుడి మనసులో మెదిలిన ఈ ప్రశ్నలు మాత్రం సమాధానాలు దొరకవు… లేవు..