మంచిర్యాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. భారీవర్షాల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా అతలాకుతలం అయ్యింది. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు నీట మునిగాయి. రాంనగర్, ఎల్ఐసీ కాలనీ, బాలాజీనగర్,ఎన్టీఆర్ నగర్,పాత మంచిర్యాలలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్లు సైతం నీటిలో మునిగిపోవడంతో మత్స్యకారులు తమ తెప్పలపై తీసుకువచ్చారు. కొందరిని గుర్రాలపై తీసుకువచ్చారు. మరిన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండంతో పాటు, వరదలు పెరుగుతాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఉన్నతాధికారులతో మాట్లాడారు. దీంతో గురువారం ఉదయమే జిల్లా కేంద్రానికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. గోదావరి ముంపు నివారణ ముందస్తు చర్యలపై అధికారులు ముందుగా సర్వే చేపట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన బృందాలు బోట్స్, లైవ్ జాకెట్స్, లైవ్‌బాయ్స్, రోప్స్ ఇతర రక్షణ సామాగ్రితో జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే దివాకర్‌రావు వెల్లడించారు.