300 మంది విద్యార్థులకు అస్వస్థత
బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఈ 1, ఈ 2 మెస్‌లో ఫ్రైడ్ రైస్ తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు వాంతులు, విరోచనాలతో బాధపడినట్లు సమాచారం. 300 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొందరిని హాస్టల్ రూముల్లోనే ఉంచి మాత్రలు ఇచ్చారు. ఆసుపత్రిలో దాదాపు 100 మందికి పైగా అడ్మిట్ అయ్యారు. కొందరికి కడుపునొప్పి తీవ్రంగా ఉండటంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. ఇందులో కొందరిని అంబులెన్స్ లో తీసుకెళ్లగా మరికొందరిని ఫ్యాకల్టీ కారులో తీసుకెళ్లారు. అయితే, అధికారులు మాత్రం విషయం బయటకు పొక్కకుండా చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.