యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టండి
-పంట నష్టం వివరాలు అంచనా వేయండి
-ప్రజా రవాణా వెంటనే పునరుద్దరించాలి
-ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు నిర్వహించాలి
-మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

మంచిర్యాల : వర్షాలు, వరదల వలన దెబ్బతిన్న రహదారులు, వంతెనలు, ముంపుకు గురైన ప్రాంతాల మరమ్మత్తు పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి వెంటనే పూర్తి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లాలోని నస్పూర్ సింగరేణి అతిథి గృహంలో వర్షాల కారణంగా జరిగిన నష్టం, తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి వర్యులు మాట్లాడుతూ వరద పరిస్థితుల్లో అధికార యంత్రాంగం చేపట్టిన సంరక్షణ చర్యలు అభినందనీయమని అన్నారు. జిల్లాలో ముంపునకు గురైన పంటల వివరాలతో పూర్తి స్థాయి అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. కోతకు గురైన రహదారులు, వంతెనలను తాత్కాలిక మరమ్మతులు చేపట్టి ప్రజా రవాణా పునరుద్ధరించాలన్నారు.
ఎడతెరపి లేని వర్షాలకు పంటలు బాగా దెబ్బతిన్నాయని పంటనష్టంపై సమగ్ర సర్వే చేయాలని అధికారులకు దిశానిర్ధశం చేశారు. రైతుల వారీగా వివరాలను సర్వేలో నమోదు చేయాలని కోరారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు. దెబ్బతిన్న విద్యుత్ సరఫరాను రెండు రోజులలోగా పునరుద్ధరించడంతో పాటు అన్ని గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించేలా చర్యలు చేపట్టాలన్నారు. దెబ్బతిన్న ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని సూచించారు. విషజ్వరాలు,వ్యాధుల నియంత్రణ, పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులు చర్యలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు నిర్వహించాలని తెలిపారు. దెబ్బతిన్న మిషన్ భగీరథ పైప్ లైన్లను త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలన్నారు.
ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు మాట్లాడుతూ వరద పరిస్థితిని అంచనా వేసి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించారు. రక్షణ చర్యలలో పాల్గొన్న సింగరేణి రెస్క్యూ సిబ్బంది మృతి చెందడం బాధాకరమని అన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యిందన్నారు. ఈ పరిస్థితుల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని, బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. భారీవర్షాలతో నేపథ్యంలో అప్రమత్తమై నదుల పరివాహక గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని, అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రాణనష్టం సంభవించకుండా చర్యలు తీసుకోగలిగామని తెలిపారు.
కలెక్టర్ భారతీ హోళీకేరీ మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలోని 13 కాలనీలు వరద ముంపునకు గురయ్యాయని తెలిపారు. పంటనష్టం,ఇతర నష్టాలపై అంచనా వేయడం జరిగిందన్నారు. 32 వేల 285 ఎకరాలలో పత్తి, 2 వేల 147 ఎకరాలలో వరి వరద ముంపు గురైందన్నారు. దీనితో దాదాపు 22 వేల మంది రైతులు నష్టానికి గురయ్యారని, 55 పశువుల మృతి చెందాయని తెలిపారు. జిల్లా మత్స్యశాఖ పరిధిలో బోట్లు, చేపలు ఇతరత్రా దాదాపు 3 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందన్నారు. జిల్లాలో రోడ్లు-భవనాల శాఖ ఆధ్వర్యంలో 38 రోడ్లు, కల్వర్టులు,కాజ్వేలు, పంచాయతీరాజ్ శాఖ పరిధిలో 25 రోడ్లు, జాతీయ రహదారి సంస్థ పరిధిలో 8 రోడ్లు వరద తాకిడికి దెబ్బతిన్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య జిల్లా అటవీ అధికారి శివాని డోంగ్రే, జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.