జాతీయ విపత్తుగా ప్రకటించాలి
ఎమ్మెల్యే జోగు రామన్న
భారీ వర్షాలతో ప్రజలు ముఖ్యంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆవేదన వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. ఇలాంటి సమయంలో కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాల్సింది పోయి రాజకీయాలు చేయడం సరికాదన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు నమోదు అయ్యాయయని, రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా కేంద్రం దీనిని జాతీయ విపత్తుగా ఎందుకు గుర్తించడం లేదని జోగు ప్రశ్నించారు. భారతదేశం మొత్తానికి తాను ప్రధాని అన్న విషయం మోదీ మర్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ లోని బీజేపీ నేతలు జిల్లా రైతులకు న్యాయం జరిగేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఎమ్మెల్యే రామన్న డిమాండ్ చేశారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ అడ్డె భోజారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, ఎంపీపీ గోవర్ధన్, మాజీ మార్కెట్ చైర్మన్ మెట్టు ప్రహల్లాద్,, పట్టణ అధ్యక్షుడు అజయ్, రైతు సమన్వయ అధ్యక్షుడు లింగారెడ్డి, కో కన్వీనర్ నారాయణ, డైరెక్టర్ పరమేశ్వర్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.