హామీ ఇచ్చారు… ఆందోళన వాయిదా వేశాం..
-నాలుగు ప్రధాన డిమాండ్లపై లిఖితపూర్వక హామీ ఇచ్చిన ఇన్చార్జి వీసీ వెంకటరమణ
-గడువులోగా తీర్చకపోతే తిరిగి ఆందోళన చేస్తామన్న బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు
ఇన్చార్జీ వీసీ వెంకటరమణ లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీ మేరకు ఆందోళన వాయిదా వేస్తున్నట్లు బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు స్పష్టం చేశారు. వారితో ఆదివారం వెంకటరమణ చర్చించారు. అనంతరం లిఖితపూర్వక హామీ ఇచ్చారు. విద్యార్థులు అడిగిన నాలుగు ప్రధాన డిమాండ్లను ఈ నెల 24 వరకు నెరవేర్చుతామని స్పష్టం చేశారు. ట్రిపుల్ ఐటీ వీసీని నియమించాలంటే మొదటగా చాన్సలర్ భర్తీ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ ఈ నెల 24 వరకు పూర్తి చేస్తామని చెప్పారు. ఇక మెస్ కాంట్రాక్టులన్నీ ఈ నెల 20 (బుధవారం) వరకు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థుల సౌకర్యాల(యూనిఫాం, బూట్లు,స్పోర్ట్స్ వేర్)కు సంబంధించి 24 వరకు పూర్తి చేయనున్నారు. ఇక విద్యార్థుల అస్వస్థతకు కారణమైన ఆహార పదార్థాలను సీజ్ చేయించడమే కాకుండా, కాంట్రాక్టులో పేర్కొన్న నిబంధనల మేరకు విద్యార్థులకు ఆహారం అందించేందుకు ఇన్చార్జీ వీసీ వెంకటరమణ విద్యార్థులకు ఆ లిఖితపూర్వక హామీలో పేర్కొన్నారు. మొత్తం నాలుగు డిమాండ్ల పై ఇంచార్జీ వీసీ రాత పూర్వక హామీ ఇచ్చారు. 24 తేదీ వరకు డిమాండ్ లు నెరవేర్చక పోతే ఆందోళన చేస్తామని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తాము విడుదల చేసిన వీడియోలో పేర్కొన్నారు.