కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికలు

భారత రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు రంగం సిద్ధమైంది. సోమవారం ఈ ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లను ఆదివారం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ పరిశీలించారు. పోలీసుల బందోబస్తు, సిబ్బంది నియామకం, ఏర్పాట్లపై సమీక్షించి పలు సూచనలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాల్‌లో రెండు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలంతా అక్కడే తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
ఓటింగ్‌లో పాల్గొననున్న 103 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. వారికి మాక్ ఓటింగ్‌పై అవగాహన కల్పించారు. అక్కడ నుంచి అసెంబ్లీకి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ 6, ఎంఐఎం 7, బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కందుకూరు ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలోనే తన ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి ముందు తెలంగాణ భవన్ లో TRS పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు కలిశారు.