ప్రాణహిత ఉగ్రరూపం
-పెన్ గంగ బ్యాక్ వాటర్ తో మునిగిన
-మహారాష్ట్రకు నిలిచిన రాకపోకలు
-జలదిగ్బంధంలో తలాయి, తిక్కపల్లి, భీమారం గ్రామాలు

వర్షాలు తగ్గినా వరద ఉధృతి తగ్గడం లేదు. ముఖ్యంగా కొమురం భీమ్, మంచిర్యాల జిల్లాలకు ఈ ముప్పు తప్పడం లేదు. మహారాష్ట్ర లోని చంద్రపూర్ జిల్లాలోని ఇరయి నదిపై ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కుమురం భీం జిల్లాలో పరిధిలో ప్రాణహిత, వార్ధా, పెన్ గంగ నదులు మళ్ళీ ఉగ్రరూపం దాల్చాయి. ఇరయి నది నుంచి వరద నీరు పెన్ గంగకు వస్తోంది. పెన్ గంగతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చే వైన్ గంగ నది వరద తుమ్మడిహెట్టి వద్ద ప్రాణహితలో కలిసి ఉగ్రరూపం దాల్చుతోంది. మంగళ, బుధవారాల్లో నదుల పరివాహక ప్రాంతాల్లోని వంతెనలు, రోడ్లు నీటమునిగాయి.
కొముమరం భీం జిల్లా సిర్పూర్(టి) మండలం పారిగాం సమీపంలో మళ్ళీ రోడ్డు పైకి బ్యాక్ వాటర్ చేరుకుంది. దీంత్తో సిర్పూర్(టి) , కౌటాల,దహేగాం, చింతలమనేపల్లి మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అక్కడి నుండి మహారాష్ట్ర కు సైతం రవాణా నిలిచిపోయింది. ఇక తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత నది ఉద్రిక్తతంగా ప్రవహిస్తోంది. పుష్కర ఘాట్ పూర్తిగా నీట మునిగింది.
తలాయి దగ్గర ప్రాణహిత నది బ్యాక్ వాటర్ రావడంతో మూడు గ్రామాలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. తలాయి తిక్కపల్లి, భీమారం గ్రామాల చుట్టూ నీరు చేరింది.
ఇక మంచిర్యాల జిల్లా వేమనపల్లి, కోటపల్లి మండలాల్లో ప్రాణహిత తీర ప్రాంతాల్లో పంట పొలాలు, చేన్లు నీట మునిగాయి.