నేడు రాష్ట్రపతి భవన్‌కు కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. సోమవారం సాయంత్రం కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళుతున్నారు. భారత 15వ రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేసిన ద్రౌపది ముర్మును కలుస్తారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారు. రాష్ట్రపతి ప్రమాణం చేసిన ఆమెకు శుభాకాంక్షలు చెప్తారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ముకు కాకుండా విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇచ్చారు కేసీఆర్. సిన్హాకు మద్దతుగా హైదారాబాద్లో సభ సైతం పెట్టారు. ఇప్పుడు మాత్రం ద్రౌపది ముర్మును కలవబోతుండటం ఆసక్తిగా మారింది.
ముఖ్యమంత్రి కేసీఆర్, రెండు, మూడు రోజుల పాటు హస్తినలోనే ఉంటారని చెబుతున్నారు. జాతీయ రాజకీయాలపై కొందరు కీలక నేతలతో చర్చిస్తారు. కొందరు మంత్రులు, సీనియర్ నేతలు కేసీఆర్తో పాటు ఢిల్లీకి వెళుతున్నారు. గతంలోనూ ఢిల్లీలో దాదాపు వారం రోజుల పాటు మకాం వేశారు సీఎం కేసీఆర్. పలువురు నేతలతో చర్చలు జరిపారు. పలు పార్టీల అధినేతలను, పలువురు ముఖ్యమంత్రులను కలిసి చర్చించారు. అయితే రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వచ్చాక సైలెంట్ అయ్యారు. ఎన్నికలు ముగియడంతో తిరిగి జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన ఆయన మళ్లీ తన ప్రయత్నాలు ప్రారంభించారు.