జర్నలిస్టుల విషయంలో తప్పు దిద్దుకున్న ఆర్టీసీ
జర్నలిస్టుల విషయంలో తప్పు చేసిన ఆర్టీసీ దానిని సరిదిద్దుకుంది. సాఫ్ట్వేర్ లోపం వల్ల జరిగిన లోపం వల్ల ఇబ్బందులు తలెత్తాయని స్పష్టం చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. జర్నలిస్టులకు కొత్త అక్రిడియేషన్ కార్డులు రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తైన తర్వాత ఆ అక్రిడియేషన్ ద్వారా ఆర్టీసీ బస్‌పాస్‌లు జారీ చేస్తుంది. గతంలో ఈ పాస్‌లు సెలవులతో సంబంధం లేకుండా ఏడాదిలో ఎప్పుడైనా ప్రయాణించే అవకాశం ఉండేది. కానీ, ఈ ఏడాది కొత్తగా ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో ఈ బస్‌పాస్‌లు పనిచేయవని సూచనలు ముద్రించారు.
దీంతో జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. టీయూడబ్ల్యుజే (ఐజేయూ) రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్ జర్నలిస్టులకు సెలవు దినాలు ఏంటని ప్రశ్నించారు. జర్నలిస్టులు 365 రోజులు పని చేస్తారని అలాంటిది వారికి సెలవు దినాలతో సంబంధం లేదన్నారు. దీనిపై అవసరం అయితే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆర్టీసీ జరిగిన తప్పు దిద్దుకునే ప్రయత్నం చేసింది.
సాఫ్ట్వేర్ సమస్య కారణంగా జర్నలిస్టుల బస్ పాస్‌లపై ఆదివారం, సెలవు దినాలలో అనుమతించరని, అనే దానితో పాటు ఇతర అసంబద్ధ సూచనలు ముద్రించారని తెలిపింది. ఈ సమస్యను గుర్తించి పరిష్కరించామని. జర్నలిస్ట్ బస్పాసుల జారీ ప్రక్రియలో జరిగిన పొరపాటుకు చింతిస్తున్నామని స్పష్టం చేసింది. పాస్‌లు పొందిన జర్నలిస్టులు సరిచేసిన సూచనలతో కొత్త పాస్‌ను పొందాలని విజ్ఞప్తి చేసింది.