సీఎం యోగిని చంపేస్తాం
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చంపేస్తామని కొందరు వాట్సప్ మెసేజ్ పంపించారు. యూపీ పోలీసులకు చెందిన 112 అనే హెల్ప్‌లైన్ వాట్సప్ నెంబర్ కు సీఎంను చంపేస్తామని మరోసారి బెదిరింపు సందేశం వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి మెసెజ్ ద్వారా యూపీ సీఎం ఆదిత్యానాథ్ కు నాలుగు రోజులే మిగిలున్నాయి… ఆయనకు మరణం తప్పదు అని హెచ్చరించారు. ఈ విషయంపై ఇప్పటికే సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. అంతేగాక హెచ్చరికలు పంపిన వారేవరో తెలుసుకుని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఓ నిఘా బృందాన్ని ఏర్పాటు చేశారు. కాగా, యోగీకి బెదిరింపు కాల్స్ అందడం కొత్తేమీ కాదు. గత ఏడాది సెప్టెంబరు నవంబరు డిసెంబరు నెలల్లో కూడా ఆయనకు బెదిరింపు కాల్స్ అందాయని పోలీసులు చెప్పారు. ఈ సీఎం కి ప్రాణహాని ఉందంటూ గత నవంబరులో 15 ఏళ్ళ టీనేజర్ ఒకడు 112 హెల్ప్ లైన్ కి మెసేజ్ పంపగా అతడి మొబైల్ నెంబర్ ని ఖాకీలు ట్రేస్ చేశారు. అతడ్ని ఆగ్రాలో ఉన్నవాడిగా గుర్తించి ఆ నగరానికి వెళ్లి అరెస్టు చేశారు. ఆ తరువాత జువెనైల్ హోమ్ కి తరలించారు. గత నెలలో కూడా హోమంత్రి అమిత్ షాతో పాటు యోగి ఆదిత్యనాథ్ ను కూడా చంపేస్తామని బెదిరిస్తూ కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు ఈ మెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. యోగికి భద్రత తక్కువేమీ కాదు. ఆయనకు జెడ్ కేటగిరీ వీవీఐపీ సెక్యూరిటీ ఉంది. 25 నుంచి 28 మంది కమెండోలు ఆయన ఎక్కడికి వెళ్లినా ఆయన నీడలా వెన్నంటి ఉంటారు.