ప్రజల్లో తిరగలేం.. రాజీనామాలు చేస్తున్నాం…
-జడ్పీటీసీతో సహా ఏడుగురు నేతల మూకుమ్మడి రాజీనామా
-కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం
తాము ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నామని.. ప్రజలకు మా మోహాలు చూపించుకోలేపోతున్నామని అందుకే పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రజాప్రతినిధులు వెల్లడించారు. బెజ్జూరు మండలానికి చెందిన ఏడుగురు ప్రజాప్రతినిధులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ముగ్గురు సర్పంచ్‌లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్, సహకార సంఘం డైరెక్టర్లు రాజీనామాలు చేస్తున్నట్లు సిర్పూరు ఎమ్మెల్యే, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడు కోనేరు కోనప్ప తమ లేఖను పంపించారు. కాసేపట్లో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
ఎమ్మెల్యే బెజ్జూరు నుంచి సోమిని వరకు ప్రధాన రహదారి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని వారు వెల్లడించారు. దీంతో ఈ రహదారిపై ఉన్నరెండు లో లెవల్ వంతెనలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఈ నెల తొమ్మిదవ తేదీన, అదే విధంగా 15వ తేదీన రెండు సార్లు వచ్చిన వరదల వల్ల పంట పొలాలతో సహా దాదాపు 12 గ్రామాలు జలదిగ్భందంలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేం ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయామని, గ్రామాల్లో తిరగలేకపోతున్నామని వారు స్పష్టం చేశారు.
తమను అధికారులు సైతం పట్టించుకోవడం లేదని, తమ ఫోన్లను సైతం లిఫ్ట్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలన్నారు. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బెజ్జూరు జడ్పీటీసీ పంద్రం పుష్పలత, కుశ్నపల్లి ఎంపీటీసీ ఆత్రం సాయన్న, సుశ్మీర్ సర్పంచ్ తొర్రెం శంకర్, సోమిని సర్పంచ్ ఎలాది శారద, మొగవెళ్లి సర్పంచ్ ఆలం మంగళ, కాగజ్‌నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నైతం సత్తయ్య, బెజ్జూరు సహకార సంఘం డైరెక్టర్ పేందం శ్రీహరి ప్రకటించారు.