లోన్ యాప్ వేధింపులకు మరొకరి బలి

లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు రోజు రోజుకూ ఎక్కువ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో గతంలో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకోగా, శనివారం మరో వ్యక్తి చనిపోయాడు.

మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మామిడి పెల్లి గ్రామానికి చెందిన బొమ్మిడి రాజేంద్ర ప్రసాద్ (35) అనే వ్యక్తి లోన్ యాప్ ద్వారా యాభై వేల రూపాయలు అప్పుగా తీసుకొన్నాడు.ఈ డబ్బులు తిరిగి వాయిదాల పద్దతిలో చెల్లించే క్రమంలో సరిగా చెల్లించకపోవడంతో ప్రతి రోజు ఫోన్ చేస్తూ వేధింపులకు గురి చేశారు. అప్పు సక్రమంగా కట్టకపోతే నీ న్యూడ్ ఫొటోస్ నీ ఫోన్ లో ఉన్నా అన్ని కాంటాక్ట్ నంబర్స్ కు పంపిస్తామని బ్లాక్ మెయిల్ చెయ్యడం మొదలు పెట్టారు. దీంతో అతను మనస్థాపం చెంది ఈ నెల 18న ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు త్రాగి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్ హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతు శనివారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మృతుడి భార్య పిర్యాదు మేరకు ఆ లోన్ యాప్ సంస్థ ఫై కేసు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్సై సాంబమూర్తి వెల్లడించారు. ఈ లోన్ యాప్ ద్వారా ఎవ్వరు కూడా లోన్స్ తీసుకోవద్దని ఆయన కోరారు. ఒకవేళ తీసుకున్న వారు వేధింపులకు గురిచేస్తే పోలీసులకు పిర్యాదు చెయ్యాలని ఎస్సై సూచించారు.

గత మేలో కూడ లోన్ ఆప్ వేధింపులకు ఒక వివాహిత బలైంది. ఆమె చనిపోయిన తరువాత కూడా పదేపదే కాల్స్‌ చేస్తూ, ఆమె మృతదేహం ఫొటోలు చూపించాలని యాప్‌ నిర్వాహకులు ఒత్తిడి చేయడం గమనార్హం. మంచిర్యాల పట్టణంలోని గోపాల్‌వాడకు చెందిన వివాహిత బొల్లు కళ్యాణి(30) ‘హలో రూపీ లోన్‌’యాప్‌ ద్వారా రూ.5 వేల రుణం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా హిందూపూర్‌కు చెందిన ఆమె భర్త బెంగళూరులోని ఓ ప్రైవేటు బ్యాంకులో మేనేజర్‌గా పని చేసేవారు. అక్కడి నుంచే ఆమె మంచిర్యాలకు వచ్చింది. అప్పటి నుంచి లోన్‌ యాప్‌ నిర్వాహకుల వేధింపులు ఎక్కువ కావడంతో రెండు దఫాలుగా రూ.20 వేలు చెల్లించింది. అయినా ఆ చెల్లింపు వివరాలు అప్‌డేట్‌ కాలేదంటూ పదేపదే ఆమెను వేధించారు. వేర్వేరు నంబర్లతో రోజుకు వందల సార్లు ఆమెకు కాల్స్‌చేస్తూ అసభ్య పదజాలంతో దూషించేవారు.

ఫోన్‌కాల్‌ వస్తోందంటే వణికిపోయి..
కాల్స్‌ మాట్లాడాలంటే భయంతో వణికిపోయిన కళ్యాణి కొన్నిసార్లు ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. దీంతో వాట్సాప్‌లో ఆమె ముఖాన్ని న్యూడ్‌ ఫొటోలతో మార్ఫింగ్‌ చేసి ఆమెకే పంపి, వీటిని అందరికీ షేర్‌ చేస్తామని బెదిరించారు. దీంతో భయాందోళన చెందిన కళ్యాణి మే 16న హెయిర్‌ డై తాగి ఆత్మహత్యకు యత్నించింది. రెండ్రోజులు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొంది 17న సాయంత్రం డిశ్చార్జి అయింది. మళ్లీ యాప్‌ నిర్వాహకులు వేధించడం మొదలుపెట్టారు. తన ఆరోగ్యం బాగాలేదని, ఇబ్బంది పెట్టొదని బతిమిలాడినా వినిపించుకోలేదు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన కళ్యాణి బుధవారం ఇంట్లోని బాత్‌రూమ్‌లోని షవర్‌కు శాలువాతో ఉరేసుకుంది. ఆమె చనిపోయిందనే విషయాన్ని నమ్మకుండా యాప్‌ నిర్వాహకులు పదేపదే కాల్స్‌ చేశారు. ఆమె మృతదేహం ఫొటోలు పంపాలంటూ కుటుంబసభ్యులను ఒత్తిడి చేశారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like