మేం తలచుకుంటే బయట తిరుగుతారా..?
-కేసీఆర్‌ను ఎదుర్కోలేక కవితపై నిరాధార ఆరోపణలు
-కాంగ్రెస్ పార్టీ వాళ్లు సంచులు మోశారు
-బీజేపీ నేతలు బూట్లు మోస్తున్నారు
-తప్పుడు కేసులు, కాసులకు టీఆర్‌ఎస్ లొంగదు.. భయపడదు
-ప్రభుత్వ విప్ బాల్క సుమన్
‘కేసీఆర్ కు పెద్దమనసు ఉంది కాబట్టే.. కాంగ్రెస్, బీజేపీ నేతలు బతికిపోతున్నారు…. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేస్తారా.. మేం తలచుకుంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ తిరగగలరా’ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఎల్పీలో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి, ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, గణేశ్ గుప్తాతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్, బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు.
కేసీఆర్ ప్రశ్నలకు మోదీ.. అమిత్ షాలకు వణుకు పుడుతోందని, దేశంలో కేంద్రాన్ని సూటిగా ప్రశ్నిస్తున్న నేత కేసీఆర్ ఒక్కరే అన్నారు. కేసీఆర్‌ను ఎదుర్కోలేక బీజేపీ.. ఎమ్మెల్సీ కవితపై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందన్నారు. కేంద్రంలో అటెన్షన్ డై వర్షన్ ప్రభుత్వం నడుస్తోందని ఎద్దేవా చేశారు. ఆయనను ఎదుర్కొనే దమ్ము లేక బీజేపీ బురదచల్లే రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులకు టీఆర్ఎస్ లొంగిపోదన్నారు. కేసీఆర్ రాజీపడి ఉంటే తెలంగాణ వచ్చి ఉండేదే కాదన్నారు. సీబీఐ బీజేపీ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని ఆరోపించారు. సింధియా, హేమంత బిశ్వ శర్మ బీజేపీలో చేరగానే.. ఈడీ విచారణ ఆగిపోయిందని గుర్తు చేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సీబీఐ, ఈడీలు దాడులు చేస్తున్నాయని అన్నారు.
ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణను ఉద్ధరిస్తాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ శిఖండి రాజకీయాలు.. కేసీఆర్ ను ఏమి చేయలేవని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఉద్యమం ప్రారంభించిన రోజు బండి సంజయ్ నెక్కర్లు కూడా వేసుకోలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వాళ్లు ఢిల్లీకి సంచులు మోసే వారు.. బీజేపీ నేతలు బూట్లు మోస్తున్నారని బాల్క సుమన్ దుయ్యబట్టారు. బండి సంజయ్.. బానిస సంజయ్‌లా మారాడని విమర్శించారు. దమ్ముంటే కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు అమిత్ షాతో సమాధానాలు చెప్పించాలని ఛాలెంజ్ చేశారు. కోమటిపెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. మునుగోడులో చిత్తుచిత్తుగా ఓడిపోతారని అన్నారు.