181 అంగన్వాడీ సూపర్వైజర్ పోస్టులకు నోటిఫికేషన్
TSPSC NOTIFICATION: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. మహిళ, శిశు సంక్షేమ శాఖలో 181 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. మహిళ, శిశు సంక్షేమ శాఖలో గ్రేడ్ వన్ సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే గ్రూప్ -1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయగా, ఇప్పుడు ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. గ్రేడ్ -1 ఎక్స్టెన్షన్ ఆఫీసర్(సూపర్ వైజర్) పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన మహిళ అభ్యర్థుల నుంచి సెప్టెంబర్ 8 నుంచి 29వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు www.tspsc.gov.in లో అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు.
మంత్రి హరీష్‌రావు ఈ రోజు ఉద్యోగ నియామక ప్రక్రియపై బీఆర్కే భవన్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అన్ని శాఖల కార్యదర్శులు, అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు 50 వేల వరకు ఉద్యోగాల నియామకాలకు అనుమతి ఇచ్చినట్లు ఆర్థికశాఖ అధికారులు తెలపగా.. అందులో సగం కూడా నోటిఫికేషన్లు జారీ చేయకపోవడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా నియామక సంస్థల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రూప్ 3, గ్రూప్ 4, ఇంజినీర్ల నియామకం, గురుకులాలు సహా ఇతర నోటిఫికేషన్ల విషయంలో ఆలస్యం చేయవద్దని స్పష్టం చేశారు. ఆయన ఆదేశించిన రోజే ఈ 181 ఉద్యోగాలకు నేడు నోటిఫికేషన్ జారీ చేయడం గమనార్హం.