తెలంగాణ విమోచనం సామాన్య ప్రజల విజయం
Mainly Telangana Liberation Day: నిజాం నిరంకుశ పాలన నుండి 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత వాసులకు విమోచనం లభించడంలో ఈ ప్రాంత సామాన్య ప్రజల పాత్ర మరువలేమని ఆర్య సమాజ్ నాయకుడు రాచకట్ల లక్ష్మణ్ సుధాకర్ అన్నారు. నిజాం విముక్త అమృతోత్సవాలను శనివారం ఉదయం వరంగల్ వెంకటరామటాకీస్ చౌరస్తాలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద నిజాం విముక్త అమృతోత్సవ సమితి వైభవంగా నిర్వహించింది. అనంతరం జరిగిన బహిరంగ సభలో లక్ష్మణ్ సుధాకర్ మాట్లాడుతూ నిజాం పాలనలో సామాన్య ప్రజల మానప్రాణాలకు విలువ లేకుండా పోయిందన్నారు. ఆనాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందుచూపుతో చేసిన సైనిక చర్యతో ఈ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని వెల్లడించారు. కార్యక్రమంలో ముందుగా ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు, నిట్ రిటైర్డ్ ప్రొఫెసర్ ఎల్. రామ్ గోపాల్ రెడ్డి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలవేశారు. అనంతరం ఉత్సవ సమితి అధ్యక్షులు, ప్రముఖ బిల్డర్ ముందాడ వేణుగోపాల్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా నిజాం నిరంకుశ పాలనను, ఆకృత్యాలను కళ్ళకు కట్టినట్లు కాశీబుగ్గ వివేకానంద సేవా కేంద్రం విద్యార్థిని, విద్యార్థులు వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకం చూపర్లను కన్నీళ్లు పెట్టించింది. ఈ నాటకం ప్రదర్శించిన విద్యార్థిని, విద్యార్థులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలోకాశిబుగ్గ చౌరస్తా నుండి వరంగల్ వెంకటరమణ చౌరస్తా వరకు ఊరేగింపుగా వచ్చారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి ఉపాధ్యక్షురాలు పోకల జ్యోతి, ఆర్య సమాజ్ నేత చిట్టి మల్ల శ్యాంప్రసాద్, కార్యదర్శులు ముదిగొండ విశ్వనాథ్, సీనియర్ అడ్వకేట్ చకిలం ఉపేందర్, కోశాధికారి మేకల లింగమూర్తి, సభ్యులు రాచమల్ల పున్నమాచారి, ఆర్య స్వాతంత్ర సమరయోధులు, విద్యార్థిని, విద్యార్థులు పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు పాల్గొన్నారు.