జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి బ్రేక్..
ఉత్తర్వులు జారీ చేసిన హై కోర్టు
Break for Singareni Junior Assistant Posts: సింగరేణి నిర్వహించిన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిపివేయాలని హై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తాయి. సింగరేణి 177 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు జూన్ 20న నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష సెప్టెంబర్ 4న నిర్వహించారు.
దీనికి సంబంధించి గోవాలో పేపర్ లీక్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సింగరేణి యాజమాన్యం ఖండించింది. ఎలాంటి అవకతవకలు జరగలేదని క్లారిటీ ఇచ్చింది. అదే రోజు అర్హత సాధించిన వారి జాబితాను వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. దీనిలో కూడా అన్నీ తప్పులతడకగా అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలోనే తప్పులు చేశారని.. వారి భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని.. వాళ్లను పరీక్ష రాయించినట్లు సింగరేణి వివరణ ఇచ్చింది.
మరోవైపు పరీక్ష జరిగిన సమయంలో అభ్యర్థులను తనిఖీ చేయలేదని.. ప్రశ్నాపత్రానికి కూడా ఎలాంటి సీలు లేకుండా అభ్యర్థులకు ప్రశ్నాపత్రం ఇచ్చారని పలువురు పేర్కొన్నారు. దీనిపై కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ముందే పేపర్ లీక్ చేసి.. పరీక్షను నిర్వహించారని.. ఈ పోస్టులను ముందే అమ్ముకున్నారని అభ్యర్థులు సోషల్ మీడియా వేదికగా గోడు వెల్లబోసుకున్నారు.
వరంగల్,ఖమ్మం బాధిత అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆరోపణల నేపథ్యంలో విచారణ జరుపకుండా ఎలా ఫలితాలు ప్రకటిస్తారని కోర్టుఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగాల భర్తీ విషయంలో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.