పొమ్మనలేక పొగ పెట్టారు..
-ప్రేంసాగర్ రావు వేధింపులు తట్టుకోని నల్లాల ఓదెలు
-పై నుంచి అభయం ఉన్నా.. బయటకు పంపిన స్థానిక నేత
It was Premsagar Rao who sent out Nallala Odelu: కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి చేరికతో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని అంతా భావించారు. చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ హస్తగతం అవుతుందని అనుకున్నారు. కానీ, అందరు ఒకటి తలిస్తే ఆ నేత ఒకటి తలిచారు. ఓదెలు, భాగ్యలక్ష్మి బయటకు వెళ్లే వరకు ఊపిరి సలపనీయలేదు. దీంతో ఆయన అనుకున్నట్లుగానే వారిద్దరూ కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు వెళ్లిపోయారు.
టీఆర్ఎస్ పార్టీలో విబేధాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, భాగ్యలక్ష్మి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. ఆయన చేరిక జిల్లాలోని పార్టీ సీనియర్ నాయకుడు ఏఐసీసీ సభ్యుడు ప్రేంసాగర్ రావుకు ససేమిరా ఇష్టం లేదు. ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరితే తన అనుచరుడికి టిక్కెట్టు ఇస్తానని ఇచ్చిన హామీ నెరవేరదనే ఉద్దేశంతో ఓదెలుకు పొమ్మనలేక పొగబెట్టారు. ఓదెలు చేరిక విషయంలో ప్రేంసాగర్ రావు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఓదెలు మొదట ప్రేంసాగర్ రావును సంప్రదించినా ఆయన సరిగ్గా స్పందించలేదు. దీంతో ఓదెలు నేరుగా రాష్ట్రంలోని నేతలను సంప్రదించి వారి ద్వారా ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ప్రేంసాగర్ రావు ఓదెలు రాకను వ్యతిరేకించడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి తన శిష్యుడుకి చెన్నూరులో టిక్కెట్టు ఇప్పించుకోవడం… రెండు తన వారికి టిక్కెట్టు ఇప్పించుకోవడం ద్వారా తన వర్గాన్ని పెంచి పోషించుకోవడం, రేపటి రోజున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తన పరపతి చాటుకుని తద్వారా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించడం ఇలా ఎన్నో రకాలుగా ప్రేంసాగర్ రావు ముందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలోనే నల్లాల ఓదెలు రాక ఆయనకు మింగుడుపడని అంశంగా మారింది. దీంతో సహజంగానే ఓదెలు రాకను ప్రేంసాగర్ రావు వ్యతిరేకించడమే కాకుండా, ఆయనను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు.
అప్పటికే ఇబ్బందులను ఎదుర్కొన్న నల్లాల ఓదెలు ఇక ప్రేంసాగర్ రావుతో పొసగదని అర్ధం అయ్యాక డైలామాలో పడ్డారు. దీనిని గ్రహించిన టీఆర్ఎస్ ఆయనను తిరిగి పార్టీలోకి ఆహ్వానించింది. అటు బాల్క సుమన్ కూడా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం లేకపోతే ఎంపీగా కంటోన్మెంట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో చెన్నూరు స్థానాన్ని భర్తీ చేయాలంటే ఖచ్చితంగా ఓదెలు ఉన్న పేరు సామాజిక వర్గం కలిసివస్తుందని అధినేత భావించడంతో ఓదెలును తిరిగి చేరాల్సిందిగా పిలుపు వచ్చింది. దీంతో అన్నింటిని బేరీజు వేసుకున్న ఓదెలు వెంటనే టీఆర్ఎస్‌లో చేరేందుకు ఒప్పుకున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో గెలుపుతో పాటు పార్టీ బలోపేతానికి అవసరం అయిన అస్త్రం చేతికి వచ్చినా ప్రేంసాగర్ రావు పుణ్యమా అని అది కాస్తా చేజారిపోయింది.