చె’న్నూరు’ పడకల ఆసుపత్రి
-చెన్నూర్ కు 100 పడకల ఆసుపత్రి మంజూరు
-ప్రభుత్వం నుండి పాలనాపర అనుమతులు జారీ
-150 గ్రామాల ప్రజలకు అందనున్న మెరుగైన వైద్యం
-ఫలించిన విప్ బాల్క సుమన్ కృషి
-హర్షం వ్యక్తం చేస్తున్న చెన్నూర్ ప్రజానీకం
నాలుగు దశాబ్దాలు.. 150 గ్రామాలు, పక్క మహారాష్ట్ర నుండి కూడా నిత్యం రోగుల రాకపోకలు… అయినా ఇక్కడ వైద్యం అందని ద్రాక్షగానే మారింది. పాలకుల నిర్లక్ష్యం.. నేతల పట్టింపులేని తనం ఇక్కడ ప్రజలకు శాపంగా మారింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారనుంది.
చెన్నూరు.. పేరుకే నియోజకవర్గం. ఒక మండల కేంద్రం కంటే అధ్వాన్నంగా పరిస్థితులు. ముఖ్యంగా వైద్యం విషయంలో దయనీయంగా ఉండేది. చెన్నూరు పట్టణం, చుట్టుపక్కల పల్లెలు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాలతో పాటు వేమనపల్లి, మహదేవపూర్ (కాళేశ్వరం), సిరోంచ వరకు సుమారు 150 పైగా గ్రామాలకు చెందిన ప్రజలంతా చెన్నూరుకు వచ్చేవారు. ఇక్కడ కూడా సరైన వైద్య సదుపాయాలు లేక మంచిర్యాల వెళ్లేవారు. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన గత పాలకులు నియోజకవర్గ వైద్య సదుపాయాలపై ఎలాంటి దృష్టి సారించలేదు. దీంతో ఇక్కడి ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది.
ఇక్కడ ఎమ్మెల్యేగా బాల్క సుమన్ గెలిచిన తర్వాత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే చెన్నూరులో ఏడు కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న ఆసుపత్రి భవనం ఇప్పుడు వంద పడకల ఆసుపత్రిగా మారనుంది. ఈ మేరకు వైద్య శాఖ నుంచి పునరావృత వ్యయం 10.45 కోట్లు (సంవత్సరానికి), పునరావృతం కాని వ్యయం 21.70 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో మామూలు ప్రైమరీ హెల్త్ సెంటర్ గా ఉన్న భవనం స్థానంలో ఏడు కోట్ల నిధులతో 30 పడకల ఆసుపత్రిగా మార్పు చేశారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ దీనిని వంద పడకల ఆసుపత్రిగా మార్పు చేయాలని పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆయన పోరాట ఫలితంతో మంగళవారం చెన్నూరు ప్రభుత్వ దవాఖాన వంద పడకల ఆసుపత్రిగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే శిధిలావస్థలో ఉన్న కుందారం ప్రైమరీ హెల్త్ సెంటర్ నూతన భవన నిర్మాణానికి రూ.1.56 కోట్ల నిధులు మంజూరు చేశారు.
ఎమ్మెల్యే బాల్క సుమన్ కృషితో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందనుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ చొరవతో ఇకపై తమకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా చెన్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు.
తొందరగా పూర్తి చేస్తా : విప్ బాల్క
సకల వసతులతో కూడిన వంద పడకల ఆసుపత్రిని వీలైనంత తొందరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని విప్ బాల్క సుమన్ తెలిపారు. నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి మంజూరు చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావుకి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.