దొంగల బండారం బయట పెట్టిన ఘనుడు కేసీఆర్
-తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడం మీ తరం కాదు
-దమ్ముంటే కాళ్వేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి
-సింగరేణిని వేలం వేయకుండా ఆపమని అడిగే దమ్ముందా..?
-మాది పేద ప్రజల ప్రభుత్వం
-ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్
Whip Balka Suman lashed out at the central government: తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని మోడీ అమిత్ షా కుట్ర చేశారని, ఆ దొంగల బండార బయటపెట్టిన ఘనుడు కేసీఆర్ అని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. చెన్నూరులో 80 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన బాల్క సుమన్ ఆ సందర్భంగా మాట్లాడారు. 400 కోట్లతో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేసిన దొంగలు చంచల్ గూడ జైల్లో చిప్పకూడు తింటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ గద్దలు తెలంగాణ కోడి పిల్లల్ని ఎత్తుకుపోవాలని కుట్ర చేశారని అన్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో తమకు సంబంధం లేదని చెబుతూనే విచారణ ఆపాలని కోర్టులో పిటిషన్ వేసిన దుర్మార్గులు బిజెపి నాయకులని దుయ్యబట్టారు. 8 రాష్ట్రాల్లో పడగొట్టినట్టు తెలంగాణ ప్రభుత్వాన్ని పడగొట్టడం మీకు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
బీజేపీ నాయకులకు దమ్ముంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణిని వేలం వేయకుండా కాపాడాలని అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవాలని బాల్క సుమన్ స్పష్టం చేశారు. రాజీవ్ రహదారిని ఆరు లైన్లుగా మార్చాలని, రిజర్వేషన్లను ఎత్తివేసే కుట్రను ఆపాలన్నారు. చెన్నూరు నుండి భూపాలపట్నం వరకు రైల్వే లైన్ కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలన్నారు. మందమర్రిలో ఎన్నికలు నిర్వహించాలని రామగుండం పర్యటనకు వస్తున్న మోడీని అడిగే దమ్ముందా…? అని బీజేపీ నేతలను ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనకు ముందు ఎనిమిదేళ్ల తర్వాత తెలంగాణ ఎలా ఉందో ప్రజలు గమనించాలని ఆయన కోరారు. తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లో విద్యుత్, మంచినీరు, రోడ్లు, వంటి మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో సాధించుకున్నామని వెల్లడించారు. 60 ఏళ్లలో చెన్నూర్ నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చెన్నూరుకి వంద పడకల ఆసుపత్రిని సాధించుకున్నామని, వందల కోట్ల నిధులతో చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామని బాల్క సుమన్ తెలిపారు.
చెన్నూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో గొప్ప నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా చెన్నూరు ఎత్తిపోతల పథకం ప్రారంభిస్తామని అన్నారు. మహారాష్ట్ర – చత్తీస్ ఘడ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ జంక్షన్ కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత పాల్గొన్నారు.