ఎర్రజెండా… టీబీజీకేఎస్ అండ..
-సింగరేణి ఎన్నికల్లో వెనక్కి తగ్గనున్న గులాబీ బాస్
-దీర్ఘకాలిక వ్యూహానికి పదును పెట్టిన అధినేత
-రాష్ట్ర ఎన్నికలతో పాటు, దేశంలో ఎర్రజెండా అండ కోసమే
-ఇప్పటికే టీబీజీకేఎస్ నేతలకు సమాచారం
TRS support to CPI in Singareni elections: వచ్చే సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కామ్రేడ్లకు మద్దతు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా ఎర్రజెండాల మద్దతు కోసం గులాబీ బాస్ వ్యూహం రచించారు. దీనిలో భాగంగా సింగరేణిలో వారికి సపోర్టుగా నిలిచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సీపీఐ అనుంబంధమైన ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వనుంది. దీంతో ఇక్కడ సమీకరణాలు మారనున్నాయి. ఇప్పటికే ఈ మద్దతుకు సంబంధించి టీబీజీకేఎస్ నేతలకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
గులాబీ బాస్ దీర్ఘకాలిక వ్యూహం..
సింగరేణి ఎన్నికల్లో పోరు రసవత్తరంగా సాగనుంది. మరి కొద్ది రోజుల్లో ఇక్కడ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాము పోటీ చేయకుండా ఏఐటీయూసీకి మద్దతు ఇవ్వనున్నారు. ఇలా మద్దతు ఇవ్వడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు చాలా రకాలుగా లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు. ఇందులో ప్రధానమైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఎర్రజెండాల మద్దతుతో పాటు, దేశంలో సైతం ఆ పార్టీలతో దోస్తానా కొనసాగించడం. ఇక ఇక్కడ ఎన్నికల్లో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గెలుస్తుందో…? లేదో…? అనే సందేహం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సింగరేణిలో టీబీజీకేఎస్ ఓటమి పాలతై అది ఖచ్చితంగా ఆరు జిల్లాలపై ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో అటు రిస్క్ తీసుకోకుండా, ఇటు ఎర్రజెండాలకు మద్దతు ఇచ్చినట్లు అవుతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
పోటీ కంటే మద్దతు మేలు..
2017 అక్టోబర్ 5న నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ గెలుపొందింది. ఒక్క శ్రీరాంపూర్ డివిజన్ మినహా అన్ని చోట్లా బొటాబోటీ ఓట్లతో బయటపడింది. మొత్తంగా ఈ ఎన్నికల్లో 17 కార్మిక సంఘాలు పోటీ పడగా.. టీబీజీకేఎస్, ఏఐటీయూసీల మధ్యే ప్రధాన పోటీ సాగింది. సీఎం కేసీఆర్ స్వయంగా కార్మికులకు ప్రయోజనం కలిగించే పలు పథకాలను ప్రకటించడంతో పరిస్థితి టీబీజీకేఎస్ వైపు మొగ్గింది. అయినా ఏఐటీయూసీ భారీగా పోటీ ఇవ్వడమే కాకుండా, రెండు ఏరియాల్లో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పోటీ కంటే మద్దతు ఇవ్వడమే మేలని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నట్లు సమాచారం.
ప్రభుత్వం మనదే… పర్వాలేదు..
ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎంపీల ద్వారా కింది స్థాయి నేతలు సమాచారం చేరవేసినట్లు తెలుస్తోంది. టీబీజీకేఎస్ నేతలు కూడా మద్దతు విషయంలో ఒకే చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వం మనదే ఉంటుంది.. సింగరేణి పనులు సైతం మనం చెప్పినట్లే జరుగుతాయి.. అలాంటప్పుడు మద్దతు ఇచ్చి వారిని గెలిపించుకున్నా మనకు వచ్చే నష్టం లేదు కదా..? అని టీబీజీకేఎస్ నేతలకు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మద్దతుకు సంబంధించిన ప్రకటన ఇప్పుడే చేయకుండా సింగరేణిలో ఎన్నికల ప్రకటన సమయంలో చేస్తారని భావిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ మద్దతు సింగరేణి ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. అదే సమయంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సైతం ఈ ప్రభావం ఉంటుందని పలువురు చెబుతున్నారు.